మళ్లీ ‘మైక్రో’ భూతం!

4 Jul, 2014 23:49 IST|Sakshi

పరిగి: సూక్ష్మ రుణాల (మైక్రో ఫైనాన్స్) భూతం మళ్లీ తన అసలు రూపాన్ని ప్రదర్శిస్తోంది. రుణ గ్రహీతలను వేధింపులకు గురి చేస్తోంది. కొంతకాలం క్రితం ప్రభుత్వ చర్యలతో కాస్త వెనక్కి తగ్గినట్లుగా కనిపించినా ప్రస్తుతం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రజలను మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం వేసిన కమిటీలు నామమాత్రంగా మారడంతోనే ఈ దుస్థితి తలెత్తిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిటీల నియామకంతోనే మమ అనిపించిన సర్కారు సూక్ష్మ రుణ సంస్థల వేధింపుల్ని మాత్రం అరికట్టలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 తాజాగా రుణమాఫీ విషయంలో జరుగుతున్న జాప్యం కారణంగా బ్యాంకులు రుణలివ్వకుండా వెనకాడుతుండటాన్ని ఆసరాగా చేసుకుని మైక్రో ఫైనాన్స్ కంపెనీలు మళ్లీ గ్రామాల్లోకి అడుగుపెడుతున్నాయి. పాత అప్పులు చెల్లిస్తే అంతకంటే ఎక్కువ రుణాలిస్తామని నమ్మబలుకుతూ వసూళ్లు ప్రారంభిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల పరిగి మండలంలోని సోండేపూర్ తండాకు చెందిన పలువురికి నోటీసులు అందజేయడంతోపాటు ఓ వ్యక్తిపై కేసు కూడా నమోదు చేశారు.  

 సుమారు రూ. 20 కోట్ల రుణాలు
 పరిగి నియోజకవర్గ పరిధిలోని పూడూరు, పరిగి, దోమ, కుల్కచర్ల, గండేడ్ మండలాల్లో ఎల్‌అండ్‌టీ, ఎస్‌కేఎస్, స్పందన తదితర సూక్ష్మ రుణాల సంస్థలు సుమారు రూ. 20 కోట్ల వరకు రుణాలు ఇచ్చాయి. బ్యాంకుల నుంచి తమకు అవసరమైన మేర రుణాలివ్వనందునే ప్రజలు ఆయా సంస్థలను ఆశ్రయిస్తుండడం ఇందుకు ప్రధాన కారణం. నియోజకవర్గంలో ప్రభుత్వరంగ బ్యాంకులు సంవత్సర కాలంలో ఇస్తున్న రుణాలకు దీటుగా మైక్రో ఫైనాన్స్ కంపెనీలు అధికంగా ఇచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా మైక్రో సంస్థలు 24 శాతం వడ్డీ అని చెబుతూ.. చక్రవడ్డీ, బారువడ్డీల పేరుతో 45 నుంచి 55 శాతం వడ్డీ వసూలు చేస్తున్నట్లు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

 ఆదుకోని ఆర్థిక చేకూర్పు
 మైక్రో ఫైనాన్స్ కంపెనీలు సైతం రుణాలిచ్చేందుకు మహిళా సంఘాలనే ఎంచుకుంటున్నాయి. మహిళల అవసరాలు పూర్తిస్థాయిలో తీర్చి ఇతర ప్రైవేటు అప్పుల నుంచి విముక్తి కలిగించడంలో భాగంగా గతంలో ప్రభుత్వం ఐకేపీ ద్వారా  ప్రారంభించిన సంపూర్ణ ఆర్థిక చేకూర్పు పథకం మహిళలను ఆదుకోవడంలో విఫలమైంది. 10 నుంచి 15 మంది ఉన్న ఒక్కో సంఘానికి, విడివిడిగా ఒక్కో మహిళకు ఏయే అవసరాలున్నాయనే దానిపై పూర్తిస్థాయిలో అధ్యయనంచేసి అవసరమైన మేరకు రుణాలివ్వాలని ప్రభుత్వం సంపూర్ణ ఆర్థిక చేకూర్పు పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఐకేపీ సిబ్బంది ప్రణాళిక తయారు చేశారు. కానీ ఆ ప్రణాళికను ఇప్పటివరకు సమర్థంగా అమలు చేయకపోవడంతో మహిళా సంఘాలు మైక్రో సంస్థల్ని ఆశ్రయించక తప్పడం లేదు.

మరిన్ని వార్తలు