30 శాతం సీట్లు నిండకుంటే.. గుర్తింపు రద్దే!

29 Aug, 2017 07:00 IST|Sakshi
30 శాతం సీట్లు నిండకుంటే.. గుర్తింపు రద్దే!
  • ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యాలకు తేల్చిచెప్పిన ఏఐసీటీఈ
  • అయితే బ్రాంచీల వారీగా అమలుకు యోచన
  • ఆ విద్యా సంవత్సరంలో ఆయా బ్రాంచీలకు అనుమతి నో!
  • తర్వాతి ఏడాది ప్రవేశాలు 30 శాతం దాటితే తిరిగి గుర్తింపు
  • రాష్ట్రంలో ఆ తరహా కాలేజీల సంఖ్యపై సాంకేతిక విద్యాశాఖ కసరత్తు
  • డిగ్రీ కాలేజీల్లోనూ కనీసం 25 శాతం ప్రవేశాలు ఉండాల్సిందే
  • యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసిన ఉన్నత విద్యా మండలి
  • సాక్షి, హైదరాబాద్‌ : ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కనీసం 30 శాతం సీట్లు భర్తీ కాకపోతే.. ఆ విద్యా సంవత్సరానికి సంబంధించి వాటి గుర్తింపు రద్దుకానుంది. ఈ విషయాన్ని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) స్పష్టం చేసింది. అయితే బ్రాంచీల వారీగా ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. అంటే ఏదైనా బ్రాంచీలో గుర్తింపు పొందిన సీట్లలో కనీసం 30 శాతం సీట్లు భర్తీ కాకుంటే.. ఆ బ్రాంచీకి అనుమతి రద్దవుతుంది.

    ఈ మేరకు ప్రతి కాలేజీలో బ్రాంచీల వారీగా వివరాలను తీసుకుని అవసరమైన చర్యలు చేపట్టేలా ఏఐసీటీఈ త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ఏఐసీటీఈ ఇటీవల ఢిల్లీలో వివిధ రాష్ట్రాల్లోని కాలేజీల యాజమాన్యాలు, యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్లతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తామని పేర్కొంది. ఇక కాలేజీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపైనా ఆ భేటీలో చర్చించింది.

    అలాంటి కాలేజీల లెక్క తేల్చేపని షురూ..  
    వివిధ రాష్ట్రాల్లో 30 శాతంలోపు సీట్లు భర్తీ అయిన కాలేజీలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా రాష్ట్రాల సాంకేతిక విద్యా శాఖల సేకరించేందుకు ఏఐసీటీఈ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక నమూనా (ఫార్మాట్‌)ను రూపొందిస్తున్నట్లు తెలిసింది. ప్రాథమిక అంచనా ప్రకారం... 2016–17 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 6,472 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండగా... వాటిలో 29,98,298 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇందులో 15,41,182 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే దాదాపు సగం సీట్లు ఖాళీగానే ఉన్నాయి.

    ఈ లెక్కన 30 శాతం సీట్లు భర్తీ కానీ కాలేజీల సంఖ్య దాదాపు వెయ్యి వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అలాంటి కాలేజీలను కొనసాగించడం సాధ్యం కాదని, అందుకే కనీస సంఖ్యలో సీట్లు నిండని బ్రాంచీలను రద్దు చేయడమే మంచిదని ఏఐసీటీఈ భావిస్తోంది. అయితే ఓ విద్యా సంవత్సరంలో కొన్ని కాలేజీల్లోని వివిధ బ్రాంచీల్లో 30 శాతం కంటే తక్కువ సీట్లు భర్తీ అయినా... తర్వాతి ఏడాది ఎక్కువగా భర్తీ అయ్యే అవకాశముందన్న అభిప్రాయం ఉంది. దీంతో ఏ ఏడాదికా ఏడాది సీట్ల భర్తీని బట్టి అనుమతి రద్దుపై నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.

    రాష్ట్రంలోనూ కసరత్తు
    రాష్ట్రంలో 30శాతంలోపు సీట్లు భర్తీ అయిన కాలేజీల సంఖ్యను తేల్చేందుకు సాంకేతిక విద్యా శాఖ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది. అందులో భాగంగా ఇటీవల జరిగిన ఇంజనీరింగ్‌ ప్రవేశాల తీరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల రాష్ట్రంలో 309 ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మ్‌–డి కాలేజీల్లో కన్వీనర్‌ కోటా ప్రవేశాలకు చర్యలు చేపట్టారు. తొలిదశ కౌన్సెలింగ్‌లో 22 బ్రాంచీలు పూర్తిగా నిండిపోగా.. 9 బ్రాంచీల్లో సీట్లు మిగిలిపోయాయి. కాలేజీల వారీగా చూస్తే.. 91 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 12 కాలేజీల్లో 50 మందిలోపే విద్యార్థులు చేరగా.. తొమ్మిది కాలేజీల్లో సింగిల్‌ డిజిట్‌లోనే చేశారు. అంటే ఈ 21 కాలేజీలతోపాటు మరో 30 నుంచి 40 కాలేజీల్లో 30 శాతంలోపే సీట్లు నిండి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ లెక్కలు తేల్చాక ఏఐసీటీఈకి నివేదించే అవకాశముంది. మరోవైపు పాలిటెక్నిక్‌ కాలేజీల్లోనూ ఈ నిబంధనను అమలు చేసే అవకాశమున్నట్లు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

    డిగ్రీలో 25 శాతంలోపు ప్రవేశాలుంటే..
    ఇక డిగ్రీలో 25 శాతంలోపు సీట్లు భర్తీ అయిన కోర్సులను కొనసాగించవద్దని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. దీనిపై అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. 25శాతంలోపే సీట్లు భర్తీ అయిన కాలేజీల వివరాలను సేకరించి.. ఈ విద్యా సంవత్సరం నుంచే ఆయా కాలేజీల్లో ఆ కోర్సు ప్రవేశాలను కొనసాగించవద్దని స్పష్టం చేసింది. సదరు కాలేజీలు/కోర్సుల్లో చేరిన విద్యార్థులను ఇతర కాలేజీల్లో చేర్పించాలని.. ఈ విషయంలో యూనివర్సిటీలు వచ్చే నెల 4వ తేదీ తరువాత చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. వచ్చే నెల 4వ తేదీ నాటికి నాలుగో దశ సీట్ల కేటాయింపు, కాలేజీల్లో చేరికలు పూర్తికానున్నాయి. దాంతో 25 శాతంలోపు విద్యార్థులున్న కాలేజీల లెక్క తేలనుంది. తర్వాత వాటిపై తుది నిర్ణయం తీసుకోనుంది.

మరిన్ని వార్తలు