ఓటర్లకు కూలర్ల పంపిణీ..?

20 Jan, 2019 15:59 IST|Sakshi
అధికారులు స్వాధీనం చేసుకున్న కూలర్లు

సాక్షి, కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలం ఇరుకుల్ల గ్రామంలో శనివారం ఎయిర్‌ కూలర్లను నిల్వ చేయడం వివాదస్పదంగా మారింది. ఓటర్లకు పంపిణీ చేసేందుకు వార్డుసభ్యుడిగా పోటీ చేస్తున్న ఓ నాయకుడు కూలర్లను లారీలో తీసుకొచ్చాడంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో అధికారులు విచారణ జరిపారు. ఇరుకుల్ల గ్రామంలో శనివారం మధ్యాహ్నం లారీలో వచ్చిన 160 ఎయిర్‌ కూలర్లను స్ధానికంగా ఉన్న రైసుమిల్లు గోదాంలో నిల్వ చేశారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు కూలర్లను తీసుకొచ్చారనే అనుమానంతో గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఆందోళకు దిగారు. 

సమాచారం అందుకున్న రూరల్‌ ఎస్సై శ్రీనివాస్‌రావు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. వేసవికాలంలో కూలర్లను విక్రయించేందుకు వీలుగా ఇక్కడికి స్టాక్‌ తీసుకొచ్చినట్లు కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తెలిపాడు. కొనుగోళ్లకు సంబంధించిన బిల్లులను చూపించడంతో ఎస్సై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తానంటూ వెళ్లిపోయారు. అయితే ఉపసర్పంచు పదవికోసం వార్డుసభ్యుడిగా పోటీ చేస్తున్న ఓ నాయకుడు ఓటర్లకు పంపిణీ చేసేందుకు కూలర్లను తీసుకొచ్చినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు