రైతులకు అక్షయపాత్ర భోజనం

12 Dec, 2016 14:40 IST|Sakshi
రైతులకు అక్షయపాత్ర భోజనం

మార్కెట్ యార్డుల్లో రూ.5కే ఆహారం: హరీశ్‌రావు
సంగారెడ్డి జిల్లా కందిలో కిచెన్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో నిర్మాణం

సంగారెడ్డి రూరల్: రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులకు వచ్చే రైతులందరికీ అక్షయపాత్ర ద్వారా రూ.5కే భోజనం అందజేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో రూ.18 కోట్లతో నిర్మించనున్న అక్షయపాత్ర మెగా కిచెన్‌కు మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలోని పలుచోట్ల వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతులకు రూ.5కే అక్షయపాత్ర భోజనాన్ని అందజేస్తున్నా మన్నారు. మిగతా మార్కెట్ యార్డుల్లోనూ ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. అక్షయ పాత్రకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

విద్యను మరింత మందికి చేరువ చేయడంతోపాటు ఆకలిని తీరుస్తూ పౌష్టికాహార లోపాన్ని అధిగమించడానికి అక్షయపాత్ర చేస్తోన్న కృషిని మంత్రి అభినందించారు. ఏటా రాష్ట్రంలో రూ. 600 కోట్లతో గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధామూర్తి మాట్లాడుతూ.. ప్రస్తుతం కందిలో మెగా కిచెన్‌ను అన్ని హంగులతో నిర్మించి జిల్లాలో లక్ష మంది విద్యార్థులకు సరిపడా భోజనాన్ని తయారు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సీహెచ్ మదన్‌రెడ్డి, అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధుపండిత్ దాసా, తెలుగు రాష్ట్రాల అక్షయ పాత్ర అధ్యక్షులు సత్యగౌరదాస, డీఈఓ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు