ప్రత్యామ్నాయంగా నిలుస్తాం!

5 May, 2015 02:54 IST|Sakshi
ప్రత్యామ్నాయంగా నిలుస్తాం!

పాలక పక్షాన్ని దారిలో పెడతామంటున్న టీయూవీ
రేపు హిమాయత్‌నగర్‌లో మేధోమథనం
9న హైదరాబాద్‌లో సదస్సు
ఒక్కతాటిపైకి టీఆర్ ఎస్ మాజీలు, ఉద్యమకారులు

 
హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఒంటెత్తు పోకడలు పోతున్న పాలక పక్షాన్ని దారిలో పెడతామంటూ తెరపైకి వచ్చిన ‘తెలంగాణ ఉద్యమ వేదిక (టీయూవీ)’.. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా మారే దిశగా ముందుకు కదులుతోంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన, ప్రజలతో సంబంధాలు ఉన్న వారందరినీ ఒకతాటి మీదకు తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే జెండాను రూపొందించుకున్న ఈ వేదిక.. ఎజెండా రూపకల్పన కోసం బుధవారం (6వ తేదీన) హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో భేటీ కానుంది. వేదిక కార్యాచరణకు ఒక రూపం ఇచ్చేందుకు ఆ రోజంతా చర్చించనుంది.

అవకాశవాదాన్ని నిలదీసేందుకు: ఎన్నో ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణలో పిడికెడు మంది పాలన సాగుతోందని, ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారికి అందలం వేస్తున్నారని టీయూవీ నాయకత్వం ఆరోపిస్తోంది. ఈ ప్రభుత్వం పచ్చి అవకాశవాదంతో పనిచేస్తోందని విమర్శిస్తోంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ఒక ప్రెషర్ గ్రూప్‌గా టీయూవీని తయారుచేస్తున్నామని వేదిక నేతలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను మౌనంగా గమనిస్తున్న కళాకారులు, మేధావులు మౌనం వీడకుంటే తెలంగాణకు ప్రమాదమన్న విషయాన్ని తెలియజేస్తామని అంటున్నారు. పది జిల్లాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ నెల 9న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు కూడా నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. రైతాంగంలో భరోసా కల్పించేందుకు, రైతుల ఆత్మహత్యల నివారణకు ఓ యాత్ర చేపట్టే ఆలోచనలోనూ వేదిక ఉన్నట్లు చెబుతున్నారు. ఉద్యమ పార్టీగా చెప్పుకున్న టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక తన ప్రాథమ్యాలు మరచిపోయిందని, ఉద్యోగాల భర్తీని విస్మరించిందని, అట్టడుగు కులాల్లో ఆత్మన్యూనత పెరిగిపోయేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని వేదిక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
 
 అన్నివర్గాల ప్రజలతో వేదిక

 
తెలంగాణ ఉద్యమ వేదిక తెలంగాణ ప్రజల కోసమే. సీఎం కేసీఆర్‌కో, టీఆర్‌ఎస్ పార్టీకో, జేఏసీకో వ్యతిరేకం కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలతో వేదిక రూపుదిద్దుకుంటోంది. పౌరహక్కుల కోసం నాయకత్వం వహిస్తామన్న వారు.. ప్రజాగాయనిపై కేసులు పెడతారు. 220 రోజులుగా సీమాంధ్ర కంపెనీ ఓసీటీఎల్ కార్మికులు దీక్షలు చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. మేం ఎవరికీ వ్యతిరేకం కాదు. పాలకపక్షానికి ప్రత్యామ్నాయంగా, ప్రజల గొంతుకగా నిలబడేందుకు సిద్ధమవుతున్నాం..
     - చెరుకు సుధాకర్
 

మరిన్ని వార్తలు