పోచంపల్లిలో అమెరికన్ల సందడి

24 Jan, 2018 18:51 IST|Sakshi
మగ్గాలను పరిశీలిస్తున్న అమెరికన్లు

భూదాన్‌పోచంపల్లి (భువనగిరి) : పోచంపల్లిలో మంగళవారం అమెరికా దేశానికి చెందిన ఆరుగురు పర్యాటకులు సందడి చేశారు. గ్రామీణ ప్రజల జీవన విధానం, చేతివృత్తులను అధ్యయనం చేసేందుకు రెండు వారాల పాటు ఇండియా పర్యటనకు వచ్చిన వీరు పోచంపల్లిలోని చేనేత గృహాలను సందర్శించి చేనేత వస్త్ర తయారీని పరిశీలించారు. మగ్గాలపై తయారవుతున్న వస్త్రాలను చూసి కార్మికుల పనితనాన్ని కొనియాడారు. అనంతరం తట్టలు అల్లడం, కార్పెంటర్‌ తదితర చేతివృత్తులను పరిశీలించారు.

పోచంపల్లి ప్యూపిల్స్‌ స్కూల్‌ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఇక్కడ అమలవుతున్న విద్యావిధానంపై ఆరా తీశారు. పిండి వంటల రుచి చూశారు. సంస్కృతి, సంప్రదాయాలకు ఇండియా పెట్టింది పేరని, అందులో పోచంపల్లిని సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందని అమెరికన్లు పేర్కొన్నారు. ఇలాంటి చేనేత, చేతివృత్తులాంటి ప్రాచీన కళ ఇక్కడే చూస్తున్నామని, అమెరికాలో లేవన్నారు. ఇప్పటికే ఆగ్రా, ఢిల్లీ, పాట్నా, జైపూర్‌ తదితర పర్యాటక కేంద్రాల్లో పర్యటించామని తెలిపారు. వీరికి నోయల్‌ మార్గదర్శకం చేశారు. విదేశీయులలో పేడ్, మేరినో, క్రిస్టిన్‌ తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు