పటేల్‌ తరహాలో మోదీ సక్సెస్‌ అయ్యారు

24 Aug, 2019 11:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సర్దార్ వల్లభాయ్‌ పటేల్ తరహాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్‌ 370ని రద్దు చేసి సక్సెస్ అయ్యారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. దేశంలో సివిల్స్‌ని ప్రవేశ పెట్టింది సర్దారేనని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న నేషనల్‌ పోలీస్‌ అకాడమీకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సర్దార్ పటేల్‌ కృషిని స్మరించుకుంటూ  అమిత్‌ షా నివాళులు అర్పించారు. శనివారం సర్దార్ వల్లభాయ్‌ పటేల్ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ(ఎన్‌పీఏ)లో అమిత్‌ షా మాట్లాడుతూ.. ‘‘70వ ఐపీఎస్‌ బ్యాచ్‌లో 12 మంది మహిళలు ప్రొబేషనరీలుగా శిక్షణ పూర్తి చేసుకోవడం దేశానికి గర్వకారణం. ఐపీఎస్‌ శిక్షణ పూర్తి కాగానే మీ లక్ష్యం పూర్తి అయినట్టు కాదు. లక్ష్య సాధన ఇప్పుడే ప్రారంభం అయ్యింది. దేశం కోసం చెయ్యాల్సింది ఇంకా ఉంది. ప్రతిరోజు మీరు ప్రతిజ్ఞను గుర్తు చేసుకుంటూ ఐపీఎస్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహించండి.

దేశంలో ఎక్కడ విధుల్లో ఉన్నా ప్రతి ఒక్కరి సమన్వయంతోనే సక్సెస్ కాగలం. మోదీ స్మార్ట్ పోలీస్ మంత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాలి. పోలీస్ సేవలు ఎక్కడ ఉంటే అక్కడ సర్దార్ పటేల్ ఉంటారు. ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు పేదరికాన్ని పూర్తిగా రూపుమాపేందుకు కృషి చేయాలి. దేశాన్ని సాధించేందుకు, దేశాన్ని రక్షించేందుకు వేల సంఖ్యలో పోలీసులు ప్రాణాలను అర్పించారు. ఉగ్రవాదం, సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలు లాంటి సవాళ్లు మన ముందు ఉన్నాయి. నిర్భయంగా ప్రతి ఒక్క ఆఫీసర్ దేశానికి సేవ చేయాలి. రాజకీయ నాయకులుగా కేవలం 5 సంవత్సరాల వరకు మాత్రమే దేశానికి సేవ చేయగలం. ఐపీఎస్‌లు 60 ఏళ్ల వరకు దేశానికి సేవ చేసే మంచి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. హైదరాబాద్‌ను భారత్‌లో కలపడానికి నిజాం ఒప్పుకోలేదు. సర్దార్‌ వల్లభాయ్ పటేల్ దాన్ని పరిపూర్ణం చేశార’’ ని తెలిపారు.

మరిన్ని వార్తలు