కొత్తగా మరో గురుకుల సొసైటీ

19 Jan, 2019 01:28 IST|Sakshi

ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లతో ఏర్పాటు 

అదనంగా 13 ఈఎంఆర్‌ఎస్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం 

వచ్చే విద్యాసంవత్సరంలోగా అందుబాటులోకి! 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా మరో గురుకుల సొసైటీ ఏర్పాటు కానుంది. ఇప్పటివరకు 5 సంక్షేమ శాఖల పరిధిలో 5 గురుకుల సొసైటీలు ఉన్నాయి. ఎస్సీలకు ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, గిరిజనులకు టీటీడబ్ల్యూఆర్‌ఈఐ ఎస్, బీసీలకు ఎంజేపీటీఎస్‌బీసీడబ్ల్యూ ఆర్‌ఈఐఎస్, మైనారిటీలకు ఎండబ్ల్యూఆర్‌ఈఐఎస్, విద్యాశాఖ పరిధిలో టీఎస్‌ఆర్‌ఈఐఎస్‌ పేరుతో గురుకుల విద్యాలయ సొసైటీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తాజాగా ఏకలవ్య గురుకుల విద్యా సంస్థల సొసైటీ పేరుతో ఏర్పాటు కానుంది. ఈ సొసైటీకి నిధులు, విధులన్నీ కేంద్రమే నిర్వహించనుంది. దీనిపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యాచరణ మొదలుపెట్టింది. 

సులభంగా నిధుల వినియోగం.. 
ఈఎంఆర్‌ఎస్‌లకు నిధులు కేంద్రమే ఇస్తుంది. వీటిని గిరిజన సంక్షేమ శాఖకు విడుదల చేయడంతో అక్కడి నుంచి అవసరాలను బట్టి నిధు లు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో నిధులు నేరుగా కాకుండా ప్రత్యేక పద్దుల ద్వారా ఖర్చు కావడంతో ప్రాధాన్యాంశాలు, అత్యవర కేటగిరీల్లో నిధుల వినియోగంలో సమస్యలు తలెత్తుతున్నాయి. కొత్తగా గురుకుల సొసైటీ ఏర్పాటు చేస్తే నిధులను నేరుగా విడుదల చేయడం సులభతరం కానుంది. గురువారం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జుయల్‌ ఓరమ్‌ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. త్వరలో సొసైటీ ప్రతిపాదనలు పంపేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. 

కొత్తగా మరో 13 ఈఎంఆర్‌ఎస్‌లు 
రాష్ట్రంలో 11 ఈఎంఆర్‌ఎస్‌లు ఉన్నాయి. ఇవన్నీ గిరిజన మండలాల్లోనే ఉన్నాయి. తాజాగా మరో 13 ఈఎంఆర్‌ఎస్‌లను మంజూరు చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఇవన్నీ వచ్చే విద్యా సంవత్సరంలోగా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు