అదనపు చెల్లింపులకు పచ్చజెండా!

25 Jun, 2015 04:33 IST|Sakshi
అదనపు చెల్లింపులకు పచ్చజెండా!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు పెరిగిన ధరలకు అనుగుణంగా నిధుల చెల్లింపున (ఎస్కలేషన్)కు కేబినెట్ సబ్ కమిటీ స్థూలంగా పచ్చజెండా ఊపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఫిబ్రవరిలో ఇచ్చిన జీవో 13ను కొద్దిపాటి మార్పులతో అమలు చేసేందుకు సానుకూలత తెలిపింది. పనులు జరగని చోట టెండర్ రద్దుచేసి కొత్తగా టెండర్లు పిలిస్తే భారం దాదాపు వందరెట్లు పెరుగుతుండటం, న్యాయపరమైన చిక్కులు తప్పని దృష్ట్యానే అదనపు చెల్లింపులపై సబ్ కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఎస్కలేషన్ కింద చెల్లింపులను కాంట్రాక్టర్లకు ఒకేమారు కాకుండా మూడు విడతల్లో చేపట్టాలని, ఇందులోనూ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయంతో ప్రాజెక్టులపై అదనంగా రూ.3వేల కోట్ల మేర భారం పడే అవకాశం ఉంది. దీనిపై కమిటీ ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు నివేదిక సమర్పించే అవకాశాలున్నాయి.
 
కొత్త టెండర్లతో భారమనే...
రాష్ట్రంలో జలయజ్ఞం కింద చేపట్టిన 33 సాగునీటి ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా 387 టీఎంసీల మేర నీటిని వినియోగించుకుంటూ సుమారు 47.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టులకు రూ.1,11,240 కోట్ల పరిపాలనా అనుమతులు లభించగా, కాంట్రాక్టర్లతో రూ.88,148 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. ఇందులో 2014-15 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.45 వేల కోట్ల మేర పనులు జరగ్గా కొన్ని పూర్తయ్యాయి, మరికొన్ని పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 25 ప్రాజెక్టుల పరిధిలోని 111 ప్యాకేజీల్లో రూ.23వేల కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులకు సంబంధించి స్టీల్, సిమెంట్, పెట్రోల్, డీజిల్, లేబర్, ఇతర సామగ్రికి పెరిగిన మార్కెట్ ధరలకు అనుగుణంగా నిధులు చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్న దృష్ట్యా ప్రభుత్వం దీనిపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రి హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్ సభ్యులుగా సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. పలు దఫాలుగా భేటీఅయిన ఈ కమిటీ బుధవారం అధికారులతో మరోమారు సమీక్షించింది.

సమీక్షలో అధికారులు ఎస్కలేషన్‌తో పడే భారం, రీ టెండరింగ్‌తో వచ్చే సమస్యలను గణాంకాలతో సహా వివరించారని తెలిసింది. నెట్టెంపాడు ప్రాజెక్టులోని ప్యాకేజీ 49ని రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిస్తే రూ.48 కోట్ల నుంచి రూ.114 కోట్లకు వ్యయం పెరిగిందని, మిడ్‌మానేరులో తొలుత రూ.261కోట్లతో వేసిన టెండర్‌కు రీ టెండర్ పిలిస్తే దాని వ్యయం ఏకంగా రూ.454 కోట్లకు పెరిగిందని అధికారులు వివరించారు. ఇలా పనులు జరగని ప్యాకేజీల్లో రీ టెండరింగ్ అంటే ఆ భారం రూ.9వేల కోట్ల వరకు ఉంటుందని, ఇది ఎస్కలేషన్‌తో పెరిగే భారానికి మూడు రెట్లని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ మాదిరిగా జీవో 13ను అమలు చేస్తూ, 2013 ఏప్రిల్ నుంచి జరిగిన పనులన్నింటికి కొత్త ధరల ప్రకారం ఎస్కలేషన్ ఇవ్వడం ఉత్తమమని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారుల వాదనతో ఏకీభవించిన సబ్ కమిటీ సూత్రప్రాయంగా ఎస్కలేషన్‌కు ఓకే చెప్పినట్లుగా సమాచారం. అయితే ఎస్కలేషన్‌తో పెరిగే వ్యయాన్ని కాంట్రాక్టర్లకు ఒకేమారు చెల్లించకుండా, మొదలు ఒకమారు, పనుల మధ్యలో ఒకమారు, పనులు పూర్తయ్యాక మరోమారు విడతల వారీ చెల్లించాలని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు