హైటెక్స్‌లో అక్వా ఎగ్జిబిషన్‌

29 Aug, 2019 19:47 IST|Sakshi

సాక్షి, హైద్రాబాద్‌ : సముద్రతీరం లేని రాష్ట్రాల్లో సముద్రపు ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేం‍ద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపిఇడిఎ) చైర్మన్‌ శ్రీ కె.ఎస్‌. శ్రీనివాస్‌ గురువారం తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ‘అక్వా అక్వేరియా ఇండియా 2019’ పేరుతో మూడు రోజుల పాటు హైటెక్స్‌ ఎగ్జిబిషన్స్‌లో నిర్వహించే ప్రదర్శనను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 2018-19లో ఏడు బిలియన్‌ డాలర్ల విలువ గల అక్వా ఉత్పత్తులను అమెరికా, ఐరోపా, చైనా, జపాన్‌ దేశాలకు ఎగుమతి చేస్తూ మనదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని తెలియజేశారు. ప్రస్తుతం మన దేశం ‘ఆర్టీమియా’ అనే చేపల ఆహారాన్ని దిగుమతి చేసుకుంటోందనీ, ఇప్పుడు దీనిని రాజీవ్‌ గాంధీ సెంటర్‌ ఫర్‌ అక్వా కల్చర్‌ అభివృద్ధి చేసిందని ఆయన వెల్లడించారు.

హేచరీస్‌, శిక్షణా కేంద్రాలను నెలకొల్పడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందనీ, శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్వా క్వారంటైన్‌ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణ మత్స్య శాఖ కమిషనర్‌ డా. సువర్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు వెయ్యి హెక్టార్లలో చేపల పెంపకాన్ని చేపడుతున్నామనీ, రిజర్వాయర్లలో, చెరువులలో చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. కాగా, ఐదు వేల మంది విదేశీ ప్రతినిధులు పాల్గొనే ఈ ప్రదర్శనలో 200 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ‘సీ ఫుడ్‌ ఫెస్టివల్‌’ పేరిట రొయ్యలు, చేపలతో చేసిన వివిధ రకాల వంటకాలను ఏర్పాటు చేస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా