ముగిసిన ఆర్మీ పరుగు

11 Feb, 2016 03:59 IST|Sakshi

7 రోజుల్లో 26,689 మంది హాజరు

 కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా బుధవారం నాటికి దేహదారుఢ్య పరీక్షలు ముగిశాయి. ఈ నెల 4న సింగరేణి సంస్థ, రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారంతో కొత్తగూడెంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. సోల్జర్ ట్రేడ్స్‌మన్, సోల్జర్ క్లర్క్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మన్, రిలీజియన్ టీచర్, డీఎస్సీ విభాగాల్లో ఎంపిక ప్రక్రియలు కొనసాగాయి. అన్ని విభాగాలకు తెలంగాణలోని 10 జిల్లాల నుంచి మొత్తం 36,051 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వారంపాటు ఒక్కో విభాగానికి సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగింది.

చివరిరోజైన బుధవారం సోల్జర్ ట్రేడ్స్‌మన్, రిలీజియన్ టీచర్, డీఎస్సీ విభాగాలకు 1,976 మంది దరఖాస్తు చేసుకోగా 1,220 మంది హాజరయ్యారు. వీరిలో పరుగుపందెంలో 343 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.  మొత్తం వారంరోజుల్లో 36,051 మంది అభ్యర్థులకుగాను 26,689 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 22,519 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో ఎంపిక కాగా, 4,154 మంది అభ్యర్థులు పరుగుపందెంలో ఎంపికయ్యారు. ఇప్పటివరకు దేహధారుడ్య పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 14వ తేదీ వరకు కొత్తగూడెం పట్టణంలో మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. మెడికల్ అనంతరం ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 28వ తేదీన సికింద్రాబాద్‌లో రాత పరీక్ష నిర్వహించి ఆర్మీకి ఎంపిక చేస్తారు.

మరిన్ని వార్తలు