‘మీ సేవ’లు అధ్వానం!

8 Jul, 2014 04:09 IST|Sakshi
‘మీ సేవ’లు అధ్వానం!
  • కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తం
  •  సకాలంలో అందని స్టేషనరీ
  •  కనీస సౌకర్యాలు కరవు
  •  జీతాలందక ఉద్యోగుల సతమతం
  • భోలక్‌పూర్: నగరంలోని ‘మీ సేవ’ కేంద్రాల పనితీరు అధ్వానంగా మారింది. ఆయా కేంద్రాలను మొక్కుబడిగా నడిపిస్తున్నారు. సరైన సేవలందక వినియోగదారులు సైతం ఇబ్బందు లు పడుతున్నారు. జీతాలు రాక ఆపరేటర్లు, మేనేజర్లు, స్వీప ర్లు సతమతమవుతున్నారు. జంట నగరాల్లో  53 మీ సేవ కేం ద్రాలున్నాయి. అందులో ఔట్‌సోర్సింగ్ పద్ధతిన సుమారు 600 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, మేనేజర్లు, స్వీపర్లు పని చేస్తున్నారు.

    2002లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను తొలుత జ్యోతి కంప్యూటర్స్ చేపట్టింది. ఆ తర్వాత స్పాన్కో టెలీ సిస్టమ్స్ సంస్థ ఈ కేంద్రాలను కొనసాగింది. గత ఏడాదినుంచి ఉపాధి టెక్నో సర్వీసెస్ వారు వీటి నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. ఆయా కేంద్రాల్లోని ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు అందడంలేదు. అదేమంటే ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదం టూ నిర్వాహకులు చెబుతున్నట్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
     
    అందని బకాయిలు..
     
    ఇదివరకు నిర్వహణ బాధ్యతలు చేపట్టిన స్పాన్కో టెలీ సిస్టమ్స్ సంస్థ ఉద్యోగులకు 19 రోజుల వేతనాలు బకాయి పడినట్టు తెలిసింది. 2013 మార్చి నెలలో కొత్త సంస్థ ఉపాధి టెక్నో సర్వీసెస్ సంస్థ బాధ్యతలు చేపట్టింది. అదే నెలలో ఈ సంస్థ 11 రోజుల వేతనం చెల్లించగా మిగతా 19 రోజుల వేతనాన్ని పాత సంస్థ చెల్లించాల్సి ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఆ సంస్థ దాదాపు 600 మంది ఉద్యోగులకు గాను రూ.30 లక్షల వరకు చెల్లించాల్సి ఉందని వారు పేర్కొంటున్నారు.
     
    సకాలంలో చేరని స్టేషనరీ..

     
    కేంద్రాల నిర్వహణకు అవసరమైన తెల్ల పేపర్లు, సర్టిఫికెట్ పేపర్లు, రశీదులు తదితర స్టేషనరీ సకాలంలో అందక  సిబ్బం ది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బిల్లులు చెల్లించిన వారి కి రశీదులు, ఇతర సర్టిఫికెట్లు ఇవ్వడానికి స్టేషనరీ అందుబాటులో లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. పలువురైతే సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఆయా కేంద్రాల్లో కనీసం సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. పాత బకాయిలు అందక, మూడు నెలలుగా రెగ్యులర్ జీతాలు లేక సతమతమవుతున్నామని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. జీతాలు చెల్లించడంతోపాటు కేంద్రాల నిర్వహణను మెరుగు పరచాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
     

మరిన్ని వార్తలు