మాట నిగ్గు తేలేదిలా

14 Jun, 2015 09:55 IST|Sakshi
మాట నిగ్గు తేలేదిలా

దేశంలోనే సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి చేరింది. ఈ నేరంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపైనే ఆరోపణలు వచ్చాయి. తమకు అనుకూలంగా ఓటు వేయాలంటూ తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో చంద్రబాబు జరిపిన సంభాషణ రికార్డులు వెలుగులోకి వచ్చాయి. ఇవి వాస్తవ రికార్డులే అని తెలంగాణ ఏసీబీ అధికారులు చెప్తుండగా.. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం వివిధ సందర్భాల్లో తాను మాట్లాడిన మాటలను క్రోడీకరించి ‘కట్ అండ్ పేస్ట్’గా తయారు చేశారని అంటున్నారు. ఈ రికార్డులు ఏ కోవకు చెందినవి, అందులో ఉన్న గొంతులు ఎవరెవరివి? అనే అంశాలు ఎఫ్‌ఎస్‌ఎల్ నిర్వహించే పరీక్షల్లో తేలనున్నాయి. ఆ పరీక్షలు ఏమిటి? ఎలా నిర్వహిస్తారు? ఎలా నిర్ధారిస్తారు? అనేది నేటి ఫోకస్..    - సాక్షి, హైదరాబాద్
 
టేపులకు రెండు రకాల పరీక్షలు
 ఆడియో, వీడియో టేపుల్ని ఫోరెన్సిక్ నిపుణులు ‘ఫోరెన్సిక్ ఆడియో-వీడియో అథెంటిఫికేషన్’ విధానంలో విశ్లేషిస్తారు. ఈ ప్రక్రియలో మొత్తం రెండు ఘట్టాలు ఉంటాయి. మొదటిది అథెంటిఫికేషన్. సదరు టేపులు రికార్డు చేసినవా, ఉద్దేశపూర్వకంగా తయారు చేసినవా అనేది ఈ పరీక్షలో తేలుతుంది. తెలంగాణ ఏసీబీ అధికారులు పంపిన టేపులను ప్రాథమికంగా ఈ కోణంలోనే విశ్లేషిస్తారు. తదుపరి ఘట్టం ఆ టేపుల్లో ఉన్న వాయిస్ ఎవరిది అనేది గుర్తించడంతో పాటు వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు ఫలానా వారే అని నిర్ధారించడం. దీన్ని సాంకేతికంగా ఐడెంటిఫికేషన్ అంటారు. ఈ విశ్లేషణల కోసం ‘మల్టీ స్పీచ్ 3700’ సహా పలు సాఫ్ట్‌వేర్స్ అందుబాటులో ఉన్నాయి.
 
అథెంటిఫికేషన్ తర్వాత ఐడెంటిఫికేషన్
 ఆడియో, వీడియో రికార్డుల అథెంటిఫికేషన్ నిర్ధారణ అయిన తర్వాత అందులో ఉండే గొంతులు, వ్యక్తుల్ని గుర్తించడం కోసం ఐడెంటిఫికేషన్ పరీక్షను నిర్వహిస్తారు. వీడియోకు ఈ పరీక్ష చేయడానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఫొటోలను వివిధ భంగిమల్లో సేకరిస్తారు. ఆడియోను పరీక్షించడానికి... ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అందుబాటులో లేకుంటే పాత రికార్డులు, అందుబాటులో ఉండే న్యాయస్థానం అనుమతితో నమూనాలు సేకరిస్తారు. నమూనాల సేకరణలో భాగంగా ఆడియోలో ఉన్న మాటల్నే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో మరోమారు చెప్పించి రికార్డు చేస్తారు. ఆ మాటల్ని స్లోగా, మీడియం ఫాస్ట్‌గా, ఫాస్ట్‌గా ఉచ్ఛారణ చేయిస్తూ,  చిన్న గొంతుతో, మధ్యస్త గొంతుతో, బిగ్గరగా చెప్పించి రికార్డు చేస్తారు. వీటిని సేకరించే ముందు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నోటికి వివిధ రకాలుగా పరీక్షిస్తారు.

ఓకల్ కార్డ్ ప్రీక్వెన్సీ కీలకం...
 ఆడియో ఐడెంటిఫికేషన్‌లో ఓకల్ కార్డ్ (స్వరపేటిక) ఫ్రీక్వెన్సీ అత్యంత కీలకాంశం. ప్రతి వ్యక్తి మాట్లాడటానికి నోరు, ముక్కుల్లో ఉండే పెరింజెల్ క్యావిటీ, లారింగ్స్, ఎసోఫేగస్ భాగాల వినియోగం తప్పనిసరి. వీటిని వినియోగిస్తేనే నోస్ ఔట్ లెట్, మౌత్ ఔట్‌లెట్స్ మధ్య సమన్వయంతో మాటలు బయటకు వస్తాయి. ఓ వ్యక్తి మాట్లాడేప్పుడు అతడి శ్వాస, నాలుక, కొండ నాలుక కలిసి పని చేయాల్సి ఉంటుంది. వీటిని ఓకల్ కార్డ్ మాడ్యులేషన్ చేస్తుంది. ఊపిరితిత్తుల్లోని గాలి ఓకల్ కార్డ్ ద్వారా వస్తూ రెండు నాలుకల మధ్య జరిగే మాడ్యులేషనే మాట. ఈ ప్రక్రియలో ఓకల్ కార్డ్ కదలికలకు ప్రత్యేక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇది ఏ ఇద్దరు మనుషులకూ ఒకేలా ఉండదు.  ప్రతి మాటకు బేస్‌టోన్, వేవ్‌లెన్త్, ఫ్రీక్వెన్సీ ఉంటాయి. ప్రముఖుల గొంతును ధ్వని అనుకరణ (మిమిక్రీ) చేసే వ్యక్తులు సైతం మొదటి రెండింటినీ అనుకరించినా ఫ్రీక్వెన్సీని మాత్రం అనుకరించలేరు. ఈ ఫ్రీక్వెన్సీని ‘ఫోరెన్సిక్ ఆడియో-వీడియో అథెంటిఫికేషన్’ విధానంలో కంప్యూటర్ ద్వారా విశ్లేషించి, ఆడియో-నమూనాలను పోల్చి చూస్తే రికార్డులో ఉన్నది ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి స్వరమా? కాదా? అనేది తేలిపోతుంది. ఈ విశ్లేషణలో మాటల్లోని పదాల మధ్య ఉన్న తీవ్రత (పిచ్), విరామం (పాస్)లను కంప్యూటర్ పరిగణనలోకి తీసుకుని రిపోర్ట్ ఇస్తుంది.
 
 ఫ్రేమ్స్ ఆధారంగా వీడియో
 ఆడియో విశ్లేషణకు, వీడియో విశ్లేషణకు దాదాపు ఒకే తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఫోరెన్సిక్ నిపుణులు వాడతారు. ఆడియోను స్పెక్ట్రమ్స్ ఆధారంగా నిర్ధారించినట్లే... వీడియోను ఫ్రేమ్స్ ఆధారంగా నిర్ధారిస్తారు. ఓ దృశ్యం వీడియోగా 24 ఫ్రేమ్‌లుగా మారి  కెమెరాలో రికార్డు అవుతుంది. ‘ఫోరెన్సిక్ ఆడియో-వీడియో అథెంటిఫికేషన్’ విశ్లేషణలో కంప్యూటర్ సాయంతో ఈ ఫ్రేమ్స్‌ను విడివిడిగా చేసి చూసినప్పుడు వాటిలో ఉన్న తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. అలానే వివిధ సందర్భాల్లో రికార్డు చేసినట్లయితే ఆ వీడియోలో కనిపించే వ్యక్తులు మారకపోయినా చుట్టుపక్కల ఉండే వస్తువులు, పరిసరాలతో పాటు ఫ్రేమ్స్ కచ్చితంగా మారతాయి. వీడియో మొత్తాన్ని వివిధ ఫ్రేమ్స్‌గా విభజించి విశ్లేషించడం ద్వారా ఈ మార్పుచేర్పుల్ని గుర్తించే అవకాశం ఉంటుంది.
 
స్పెక్ట్రమ్స్‌తో ఆడియో గుట్టురట్టు
 ఏదైనా ఫోన్ కాల్, సంభాషణ, సభ, సమావేశం తదితరాలను రికార్డు చేసినప్పుడు ఇంటెండెడ్, అన్-ఇంటెండెడ్ శబ్దాలు అందులో రికార్డు అవుతాయి. ఓ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు రికార్డు అయ్యే అతడి మాటలు ఇంటెండెడ్ స్పీచ్ కేటగిరీలోకి వస్తే... వెనుక వచ్చే వివిధ రకాలైన శబ్దాలు (నాయిస్) అన్-ఇంటెండెడ్ స్పీచ్ కేటగిరీలోకి వస్తాయి. ఏ రెండు ప్రాంతాలు, సమయాలు, సందర్భాల్లో మాటలు (ఇంటెండెడ్ స్పీచ్) ఒకేలా ఉన్నా... నాయిస్ మాత్రం ఒకేలా ఉండదు. ఆ ప్రాంతం, పరిసరాలను బట్టి ఇది మారుతూ ఉంటుంది. ‘కట్ అండ్ పేస్ట్’ ఆడియోలో ఈ తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. సదరు ఆడియో/రికార్డును ‘మెటాడేటా అనాలసిస్’ విధానంలో విశ్లేషించడం ద్వారా స్పీచ్, నాయిస్‌లను విడివిడిగా గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రాథమికంగా నిపుణులు ఆడిటరీ ఎగ్జామినేషన్‌లో వినడం ద్వారా ఈ మార్పుచేర్పుల్ని గుర్తిస్తారు. మరింత అథెంటిక్‌గా నిర్ధారించడం కోసం రికార్డులకు సాంకేతికంగా స్పెక్టోగ్రాఫిక్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి ఆడియోను స్పెక్ట్రమ్స్ రూపంలోకి మారుస్తారు. ఈ పరీక్షలో ఆడియో కంప్యూటర్ తెరపై స్పెక్టోగ్రామ్స్‌గా పిలిచే గ్రాఫ్‌ల రూపంలో కనిపిస్తుంది. ఈ గ్రాఫ్‌ల్లో కనిపించే స్పీచ్, నాయిస్ లెవల్స్ ఒక్కో ఫ్రీక్వెన్సీలో కనిపిస్తుంటాయి. వీటిలో వచ్చే తేడాల ఆధారంగా ఆడియో విశ్వసనీయతను నిర్ధారించి నివేదిక తయారు చేస్తారు. ఫొటోలు జేపీజీ (జేపెగ్) ఫార్మాట్‌లో సేవ్ అయినట్లే.. వాయిస్ రికార్డులు ఎంపీజీ (ఎంపెగ్) ఫార్మాట్‌లో సేవ్ అవుతాయి. ఇలా సేవ్ అయిన ప్రతిసారీ సదరు ఫైల్‌లో అంతర్గతంగా డేట్-టైమ్-ఫార్మాట్ సేవ్ అవుతాయి. మెటాడేటా అనాలసిస్‌లో ఇవి కూడా స్పష్టంగా తెలుస్తాయి. ఒకే సందర్భంలో రికార్డు చేసిన ఆడియోకు వీటిలో భారీ మార్పులు ఉండవు. అలా ఉంటే ‘కట్ అండ్ పేస్ట్’గా తేలిపోతుంది.
 
ఎఫ్‌ఎస్‌ఎల్‌లో సి-డార్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకూ ఉమ్మడిగా సేవలు అందిస్తున్న ఎఫ్‌ఎస్‌ఎల్ గత ఏడాది లండన్ నుంచి సి-డార్ అనే అత్యాధునిక పరికరాన్ని కొనుగోలు చేశారు. వివిధ రకాలైన ఆడియోలను విశ్లేషించి, కచ్చితమైన నివేదికలు ఇవ్వడానికి ఇది ఉపకరిస్తుంది. దక్షిణ భారతదేశంలోని మరే ఇతర రాష్ట్రాలకు చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్స్‌లోనూ ఇలాంటి పరికరం అందుబాటులో లేదు. సభల్లోనూ, ఆన్‌లైన్‌లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలతో పాటు ఫోన్ల ద్వారా, నేరుగా బెదిరింపులే కాదు... కొన్ని రకాలైన భారీ కుంభకోణాల కేసుల దర్యాప్తులోనూ అనుమానిత వ్యక్తి వాయిస్ రికార్డులు, శాంపిల్స్‌ను పక్కాగా విశ్లేషించడానికి ఇది ఉపకరిస్తుంది. గతంలో ఈ తరహా పరీక్షల కోసం పోలీసు విభాగంతో పాటు ఇతర ఏజెన్సీలు చండీగఢ్‌లో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబొరేటరీపై ఎక్కువగా ఆధారపడేవి. దీనికి పరిష్కారంగా లండన్‌కు చెందిన ప్రముఖ కంపెనీ నుంచి సి-డార్ పరికరాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు ఒప్పందం ప్రకారం ఎఫ్‌ఎస్‌ఎల్‌లో పని చేస్తున్న నిపుణులకు సి-డార్ సంస్థ లండన్‌లో ప్రత్యేక శిక్షణ సైతం ఇచ్చింది. వీడియో విశ్లేషణకూ ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ప్రత్యేక పరికరాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు