అనంతగిరిలో ఆయూష్‌ కేంద్రం

8 Aug, 2019 11:05 IST|Sakshi

ఇప్పటికే రూ.6కోట్ల నిధులు విడుదల

టీబీ ఆస్పత్రి పరిసరాలను పరిశీలించిన ఎమ్మెల్యే, రాష్ట్ర ఆయూష్‌ కమిషనర్‌ అలుగు వర్షిణి 

సాక్షి, వికారాబాద్‌: తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి కొండపై ఆయూష్‌ ఆరోగ్య కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్, ఆయూష్‌ రాష్ట్ర కమిషనర్‌ అలుగు వర్షిణిలు తెలిపారు. బుధవారం వికారాబాద్‌ పట్టణానికి సమీపంలోని అనంతగిరిలో ఉన్న టీబీ ఆస్పత్రిని, వార్డులను తదితర భవనాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరిలో ఆయూష్‌ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

అనంతగిరిలో టీబీ ఆస్పత్రితో పాటు ఆయూష్‌ ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో టీబీ ఆస్పత్రి మరమ్మతులకు విడుదలైన నిధులను సక్రమంగా ఉపయోగించలేదన్నారు. ఆయూష్‌ ఆరోగ్య కేంద్రానికి అవసరమైన భవన నిర్మాణాలకు, మరమ్మతులకు విడుదలైన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామన్నారు. ఇపుడు ఆయూష్‌ హాస్పిటల్‌ ప్రారంభించేందుకు రూ.6కోట్ల ని«ధులు మంజూరయ్యాయని విడతల వారీగా ఆయూష్‌ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఆయూష్‌ రాష్ట్ర కమిషనర్‌ అలుగు వర్షిణి మాట్లాడుతూ... దశాబ్దాలకు ముందే ఇక్కడ టీబీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారని, ప్రస్తుతం టీబీ రోగులు బాగా తగ్గారని వారి కోసం ప్రత్యేకంగా ఆస్పత్రి కొనసాగుతుందని కొత్తగా ఆయూష్‌ ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఇక్కడ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక్కడ అవసరమైన భవనాలు, సిబ్బంది, మౌలిక వసతులు అన్నింటిని త్వరలోనే సమకూరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీబీ ఆస్పత్రి సూపరిటెండెంట్‌ సుధాకర్‌షించే, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ డీఈ అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు. 


అనంతగిరి పరిసరాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, ఆయూష్‌ కమిషనర్‌ అలుగు వర్షిణి

మరిన్ని వార్తలు