భళా..ఉత్సవ్

8 Nov, 2014 03:26 IST|Sakshi

కొత్తగూడెం : బాలలతో కొత్తగూడెం కళకళలాడింది. మూడు రోజులపాటు నిర్వహించే జాతీయ స్థాయి 23వ అంతర్‌పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాలు (బాలోత్సవ్-14) పట్టణంలోని కొత్తగూడెంక్లబ్‌లో శుక్రవారం అంత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

రేలారే రేలా ఫేం సయ్యద్ రషీద్ జ్యోతి ప్రజ్వల చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు బాలోత్సవ్‌కు సుమారు ఐదు వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. 15 అంశాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటారు. ఆటాపాటలతో చిన్నారులు ఆహూతులను అలరించారు. సాంస్కృతిక, సాహిత్య తదితర రంగాలకు చెందిన ప్రముఖులు బాలోత్సవ్‌కు హాజరై పిల్లల్లో ఉత్సాహాన్ని నింపారు. ఢిల్లీలో ఉంటూ తెలుగు మాట్లాడే చిన్నారుల కోసం నిర్వహిస్తున్న ఈ పండగకు హాజరైన మహతి, పారూన్ ప్రారంభోపన్యాసం ఇచ్చారు.

 ఈ పోటీలు జాతీయ స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వీరితోపాటు వీరి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సైతం  పోటీలు తిలకించేందుకు తరలి వచ్చారు. వీరందరికీ నిర్వాహకులు ఉచితంగా వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. అయితే.. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు సుమారు మూడు వేల మందికి స్వచ్ఛందంగా భోజనం, వసతి కల్పించారు.

 15 విభాగాల్లో పోటీలు
 తొలిరోజు బాలోత్సవ్‌లో  15 విభాగాల్లో పోటీలు జరిగాయి. తెలుగు మాట్లాడుదాం పోటీకి 285 మంది, సినీ, లలిత, జానపద గీతాలు జూనియర్స్ విభాగంలో 152 మంది, సీనియర్స్‌లో 145, కవితా రచనలో 245, కథా విశ్లేషణలో 225, భరత నాట్యం సబ్ జూనియర్స్‌లో 59, కూచిపూడి సబ్ జూనియర్స్‌లో 107, జానపద నృత్యాల్లో 160, క్విజ్ పోటీలకు 250, , నాటికల్లో 90 బృందాలు, స్పాట్ డ్రాయింగ్‌లో 200 మంది పాల్గొన్నారు.

 విజేతలు వీరే...
 చిత్రలేఖనం జూనియర్స్ : హైదరాబాద్ వికాస్ కాన్సెప్ట్ స్కూల్‌కు చెందిన జి.వి.దివ్యశ్రీ ప్రథమ, ఖమ్మం శ్రీ చైతన్య ఇంటర్ నేషనల్ స్కూల్‌కు చెందిన ఆర్.దీక్షిత ద్వితీయ, ఖమ్మం హార్వేస్ట్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన కె.లోహిత తృతీయ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లావణ్యరెడ్డి స్పెషల్ ప్రైజ్‌లు గెలుచుకున్నారు.
 చిత్రలేఖనం సబ్ జూనియర్స్ : ఖమ్మం న్యూవిజన్ స్కూల్‌కు చెందిన జే.జోహారిక ప్రథమ, హైదరాబాద్ వికాస్ కాన్సెప్ట్ స్కూల్‌కు చెందిన ప్రంజల్ శర్మ ద్వితీయ, కర్నూలు జిల్లా నంద్యాల శ్రీగురురాజా స్కూల్‌కు చెందిన పి.బెన్నీబాల్‌రాజ్ తృతీయ బహుమతులు గెలుచుకున్నారు.

 చిత్రలేఖనం సీనియర్స్  : ఖమ్మం జిల్లా రుద్రంపూర్ సెయింట్ జోసప్ హైస్కూల్‌కు చెందిన ఎం.డి.అనీస్ ప్రథమ, ఖమ్మం జిల్లా పాల్వంచ డీఏవీ మోడల్ స్కూల్‌కు చెందిన జి.నవీన్ ద్వితీయ, అశ్వాపురం అటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్‌కు చెందిన జి.సంజయ్‌బార్గవ్ తృతీయ బహుమతులు గెలుచుకున్నారు.

 లఘు చిత్ర సమీక్ష  విభాగం : నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన శ్రీ తేజ విద్యాలయం విద్యార్థి అభిజ్ఞ ప్రథమ, ఖమ్మం జిల్లా కొత్తగూడెం త్రివేణి స్కూల్‌కు చెందిన వి.హడప్ప ద్వితీయ, ఖమ్మం న్యూఇరా మైండ్ ఫీల్డ్స్‌కు చెందిన ఎస్.కె.అస్లం తృతీయ బహుమతులు సాధించారు.

 కవితా రచన జూనియర్స్ :  కర్నూలు జిల్లా నంద్యాల గురురాజా స్కూల్‌కు చెందిన ఎం.మనీషా ప్రథమ, ఖమ్మం జిల్లా మణుగూరు ఎస్‌సీ హైస్కూల్‌కు చెందిన టి.వెన్నెల ద్వితీయ, భద్రాచలం ఎస్‌ఎస్‌ఎంజీ హైస్కూల్‌కు చెందిన దివ్యసాయి తృతీయ బహుమతులు సాధించారు.
 కవితా రచన  సీనియర్స్ : ఖమ్మం హార్వేస్ట్ స్కూల్‌కు చెందిన శ్రీహిత ప్రథమ, భద్రాచలం నవోదయ స్కూల్‌కు చెందిన టి.చందన ద్వితీయ, ఖమ్మం భారత్ బాలమందిర్‌కు ఎందిన వి.సాయిసుష్మా తృతీయ బహుమతులు సాధించారు.

 సృజనాత్మకత భేష్
 ప్రతి పోటీలోనూ విద్యార్థులు ఎవరికి వారే దీటుగా తమ సజనాత్మకతను చాటుకున్నారు.
   సినీ, లలిత, జానపద గీతాల పోటీల్లో సైతం తమ వయసుకు మించి ప్రతిభను కనబర్చడంతో న్యాయ నిర్ణేతలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. కథా విశ్లేషణ లో ‘రెండు రాజ్యాలు- అభివృద్ధికి దారులు’ అనే అంశాన్ని ఇవ్వడంతో విద్యార్థులు తమ ఆలోచనాశక్తికి పదునుపెట్టారు. పెయింటింగ్ విభాగంలో ‘సామాజిక రుగ్మతలు’ అనే అంశాన్ని పేపర్‌పై అద్భుతంగా చిత్రీకరించారు.

 అలరించిన జానపద నృత్యాలు
 బాలోత్సవ్‌లో జానపద నృత్యాలు ఉర్రూతలు ఊగించాయి. ‘బొట్ల బొట్ల చీర కట్టి.. బొమ్మంచు రవికతొడిగి’ అని పాట మొదలుకాగానే వేదికపై చిన్నారులతోపాటు ఆహూతులు సైతం నృత్యాలు చేశారు. ‘నా అందం చూడుబాబయ్యో..’ అంటూ సాగే పాటకు కేరింతలు, కరతాళధ్వనులు మార్మోగాయి. సాయంత్రం ఇండోర్ స్టేడియంలో జరిగిన సబ్ జూనియర్స్ భరత నాట్యం, కూచిపూడి నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.

 కాస్ట్యూమ్స్ రెడీ
 బాలోత్సవ్‌లోని వివిధ పోటీల్లో పాల్గొనే చిన్నారుల కోసం రెడీమేడ్ కాస్ట్యూమ్స్ కొత్తగూడెం క్లబ్ ప్రాంగణంలోనే అందుబాటులో ఉన్నాయి. ఏ వేషమైనా... ఏ నృత్యమైనా ఇక్కడ అన్ని రకాల వస్తువులు లభిస్తున్నాయి. భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలు, నాటికలు, ఫ్యాన్సీడ్రెస్ పోటీల్లో పాల్గొనే వారికి అవసరమైన కాస్ట్యూమ్స్, వస్తువులు లభ్యమవుతున్నాయి. కర్నూలు, హైదరాబాద్, విజయవాడ నుంచి వచ్చిన కళాకారులు ప్రత్యేకంగా మేకప్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.

మరిన్ని వార్తలు