గడువు దాటితే వడ్డింపే..

19 Aug, 2019 11:29 IST|Sakshi

సాక్షి, సుల్తానాబాద్‌: కూలీల కొరత, ఎరువుల ధరలు పెరిగిపోతుండటంతో సాగు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా పెట్టుబడుల సమయంలో బయట అప్పులు దొరకని సందర్భంలోనే సన్న, చిన్నకారు రైతులు పంటరుణాలతో పాటు బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. వీటిపై వడ్డీరాయితీని ఎత్తివేస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా 60,335 మంది రైతులకు రూ.570కోట్లు పంపిణీ చేశారు. గతేడాది ఖరీఫ్‌లో 17,385మంది రూ.217 కోట్లు తీసుకున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటి వరకు 374 మంది రైతులు బంగారు నగలను ఆయా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి సుమారు రూ.4 కోట్ల రుణాలు తీసుకున్నారు.

నవీకరణకే ప్రాధాన్యం..
బ్యాంకర్లు అయిదేళ్ల నుంచి పంట రుణాల నవీకరణకే ప్రాధాన్యమిస్తున్నారు. నిర్ధేశించిన లక్ష్యం చేరేందుకు ఈ మార్గాలు ఎంచుకున్నారు. ఇదివరకు తీసుకున్న రుణానికి చెల్లించాల్సిన వడ్డీని కలిపి కొత్తగా రుణం మంజూరు చేసినట్లు కాగితాల్లో రాసుకుంటున్నారు. ఇలా చేయడంతో రైతుల చేతికి కొత్తగా డబ్బులు రావడంలేదు. ఇక సహకార సంఘాల్లో పుస్తక సర్దుబాట్లతోనే సరిపెడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పెట్టుబడి సాయం పంటపొలాల్లో దుక్కులు సిద్ధం చేసేందుకే సరిపోవడం లేదు. చిన్నకమతాల రైతులు తమ వద్ద ఉన్న బంగారు నగలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పంట రుణాలు పొందుతున్నారు. బ్యాంకర్లు ఇప్పటి వరకు వీటికి వడ్డీరాయితీని వర్తింపజేసేవారు. ఇకపై ఈ విధంగా చేసే అవకాశం లేకపోవడంతో రైతుల నెత్తిన మరింత భారం పడనుంది.

అమలు ఇలా..
రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు నాబార్డు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సంయుక్తంగా ఏయే పంటకు ఎంత రుణం ఇవ్వాలనేది నిర్ణయిస్తాయి. రైతులు ఎంచుకునే పంట, ప్రాంతాన్ని స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌కు అనుగుణంగా ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.45 వేల వరకు ఇస్తున్నారు. సహకార సంఘాల్లోనూ ఇదే విధానం అమలు చేస్తున్నారు. ఏటా సక్రమంగా చెల్లించే రైతులకు ఇంకా ఎక్కువగా ఇస్తున్నారు. రూ.లక్ష దాకా తీసుకొన్న రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ లభిస్తోంది. బ్యాంకర్లు వసూలు చేస్తున్న 7శాతం వడ్డీలో రాష్ట్ర సర్కారు 4 శాతం, కేంద్ర ప్రభుత్వం 3 శాతం భరిస్తున్నాయి. రూ.లక్షకు పైగా రుణాలు తీసుకొన్న రైతులు 3 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు.

నూతన నిబంధనలు ఇలా..
కేంద్రం వడ్డీ రాయితీ రుణ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.3 లక్షలకు పెంచింది. ఈ మొత్తం వరకు 3శాతం వడ్డీ చెల్లించాల్సిన పని ఉండదు. ఇంత వరకు బాగానే ఉన్నా ఏడాదిలోగా చెల్లించకుంటే వడ్డీరాయితీ వర్తించదంటూ నిబ ంధన పెట్టింది. నగలను తాకట్టు పెట్టి తీసుకొనే రుణాలకు వడ్డీ రాయితీ వర్తించదన్నమాట.

మార్గదర్శకాలకు అనుగుణంగానే..
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి నుంచి విడుదలయ్యే మార్గదర్శకాలకు అనుగుణంగానే వడ్డీరాయితీని బ్యాంకులు వసూలు చేస్తాయి. ఇటీవల కేంద్రం పంట రుణాల మంజూరీలో పలు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వీటి అమలుపై మార్గదర్శకాలు విడుదల కాలేదు. ఈ సీజన్‌ నుంచి అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. 
– ప్రేమ్‌కుమార్‌  లీడ్‌ బ్యాంకు మేనేజర్, పెద్దపల్లి

మరిన్ని వార్తలు