బతుకమ్మ చీరలు వస్తున్నాయ్‌!

1 Oct, 2018 13:34 IST|Sakshi

రేషన్‌ దుకాణాల సమీపంలో ఉన్న ప్రభుత్వ భవనాల్లో చీరల పంపిణీ చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ బడులు, కమ్యూనిటీ హాళ్లు వేదికలుగా అందజేస్తారు. రేషన్‌ కార్డులో పేరుండటంతోపాటు ఏదేని గుర్తింపు కార్డు (ఆధార్‌/ఓటర్‌) తీసుకెళ్తే చీరలు పంపిణీ చేస్తారు. ఎంపీడీఓలు, సెర్ప్‌ ఏపీఓల ఆధ్వర్యంలో పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది. గతేడాది విస్తృతంగా ప్రచారం చేసినా నాణ్యత లేదనే కారణంతో చాలామంది మహిళలు చీరలు తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో సుమారు లక్షకుపైగా చీరలు మిగిలిపోవడంతో వెనక్కి వెళ్లాయి. ఈ ఏడాదైనా నాణ్యత ఉంటుందా.. లేదా అని మహిళలు చర్చించుకుంటున్నారు. 

అసాక్షి, రంగారెడ్డి జిల్లా: బతుకమ్మ చీరలు త్వరలో జిల్లాకు రానున్నాయి. బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ‘బతుకమ్మ చీరలు’ పంపిణీని గతేడాది ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సైతం మహిళలకు చీరలు అందజేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 18 ఏళ్ల వయసు నిండి ఆహార భద్రత కార్డులో పేరున్న ప్రతి మహిళకు ఒకటి చొప్పున చీరను పంపిణీ చేయనున్నారు. 557 గ్రామ పంచాయతీలు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని మూడు సర్కిళ్లు, మున్సిపాలిటీల్లో ఒకేసారి పంపిణీ చేపట్టే అవకాశం ఉంది.

జిల్లా పరిధిలోని రేషన్‌ కార్డుల్లో పేరున్న 6.49 లక్షల మంది మహిళలకు బతుకమ్మ చీరలు త్వరలో అందనున్నాయి. ఈనెల 12 నుంచి 15 వరకు వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో జిల్లాకు స్టాక్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పంపిణీ చేసేంత వరకు వీటినా వ్యవసాయ మార్కెట్‌ కమిటీల గోదాముల్లో భద్రపరచనున్నారు.

మరిన్ని వార్తలు