హామీలు..పట్టాలెక్కేనా..?

8 Jul, 2014 00:36 IST|Sakshi
హామీలు..పట్టాలెక్కేనా..?

 ప్రతి ఏటా రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు అరకొర కేటాయింపులతోనే సరిపుచ్చుతున్నారు. దీంతో గత కొన్నేళ్లుగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. వారి ప్రతిపాదనలను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోలేదు. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్వే ప్రాజెక్టులు రావడం లేదన్న అభిఫ్రాయం ఉంది. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు కూడా మోక్షం కలగడం లేదు. ఇక కేంద్రం కేటాయించిన నిధులు రైల్వే లైన్ల సర్వేకే సరిపోతున్నాయి తప్ప రైలు మార్గాల నిర్మాణానికి చాలడం లేదు.
 
 నెలకు రూ.40లక్షల ఆదాయం
 నల్లగొండ మీదుగా నిత్యం 12 రైళ్లు రెండు సార్లు రాకపోకలు సాగిస్తున్నా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని సమయాల్లో రైలులో కాలు పెట్టడానికి కూడా స్థలం దొరకడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నల్లగొండ రైల్వే స్టేషన్ ద్వారా నిత్యం 1500 జనరల్ టికెట్లు, రెండు వేల వరకు రిజర్వేషన్ టికెట్లు అమ్ముడవుతుంటాయి. వీటి ద్వారా రైల్వే శాఖకు నెలకు రూ.40 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. అయినా కేంద్రం రైల్వే స్టేషన్‌కు బడ్జెట్‌లో మొండిచేయి చూపిస్తోంది. సింగిల్ లైన్ మార్గం వల్ల రైళ్ల రాకపోకలు ఇబ్బంది కరంగా మారింది. గుంటూరు, విజయవాడ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్లు జిల్లా కేంద్రానికి రాకముందే ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి జిల్లా మీదుగా మిర్యాలగూడ వరకు వెళ్లే ప్యాసింజర్ రైలు నడికుడి వరకు పొడగించారు. దీంతో తిరిగి రైలు జిల్లాకు వచ్చే సరికి నిండిపోతుంది. పూణే-భువనేశ్వర్-కాకినాడ-భావన్‌నగర్ వరకు ప్రస్తుతం వారానికోసారి రైళ్లు వెళ్తున్నాయి. వాటిని ప్రతి రోజు నడిపిస్తే సౌకర్యంగా ఉంటుంది.
 
 డబ్లింగ్, విద్యుదీకరణకు చోటు దక్కేనా..
 బీబీనగర్-నల్లపాడు రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ జిల్లా ప్రజల చిరకాల స్పప్నంగా మారింది. డబ్లింగ్‌తో పాటు విద్యుద్దీకరణ చేపట్టాలని జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు గతంలో ప్రతిపాదనలు పెట్టినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అంతే కాకుండా మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌ను ఆదర్శ స్టేషన్‌గా గుర్తించాలనే డిమాండ్‌ను సైతం గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కాగా బీబీనగర్-నల్లపాడు వరకు డబ్లింగ్ పనులకు రెండేళ్ల క్రితం సర్వే కోసం ప్రతిపాదనలు చేశారు. కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా వేసిన మొట్టమొదటి రైల్వే లైన్ ఇదే. రైళ్ల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండటం వల్ల సింగిల్ లైన్‌తో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. మిర్యాలగూడ నుంచి సికింద్రాబాద్ వెళ్లాలంటే నాలుగు గంటల సమయం పడుతుంది. డబ్లింగ్‌లో పాటు విద్యుదీకరణ చేస్తే గంటల తరబడి క్రాసింగ్‌లో పెట్టే పరిస్థితి నుంచి ప్రయాణికులకు ఉపశమణం కలుగుతుంది. ఈసారైనా నిధులు మంజూరయ్యేనా అని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.
 
 ఎంఎంటీఎస్ వచ్చేనా..?
 ఎంఎంటీఎస్ రైళ్లను భువనగిరి వరకు పొడిగించాలని ఇక్కడి ప్రజలు ఎంతోకాలంగా కోరుతున్నారు. రెండేళ్ల క్రితం బడ్జెట్‌లో ఎంఎంటీఎస్(మల్టీ మోడ ల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్) రైళ్లను రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన అధికారులు ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. దీంతో మూడో దశలో ఉన్న భువనగిరికి ఎంఎంటీఎస్ రైళ్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఘట్కేసర్‌కు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరికి ఎంఎంటీఎస్ రైళ్ల ఆవశ్యకత ఎంతో ఉంది. పెరుగుతున్న పారిశ్రామికీకరణ, వైద్య, విద్యా సౌకర్యాలు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎంఎంటీఎస్ రైళ్ల అవసరం ఎంతో పెరిగింది.
 

మరిన్ని వార్తలు