‘కమలం’.. నోరు పదిలం

14 Jun, 2015 10:58 IST|Sakshi
‘కమలం’.. నోరు పదిలం

బీజేపీ నాయకులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. మిత్రపక్షం టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేకు ముడుపుల వ్యవహారంలో అడ్డంగా బుక్కవడం వారికి కొత్త సమస్యలు తెచ్చి పెట్టింది. వారి పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు రూ.50 లక్షలు ఇచ్చి లోబరుచుకునేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రయత్నించి ఏసీబీకీ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తీరుపై ఏమని స్పందించాలో తెలియక వారు తమ నోళ్లకు తాళాలు వేసుకున్నారు. ఇందుకు సంబంధించి వీడియో టేపులు, ఇతర ఆధారాలతో పాటు రేవంత్‌రెడ్డి అరెస్ట్ కావడం వారిని కిమ్మనకుండా చేసింది. అంతటితో ఆగకుండా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు నేరుగా ఫోన్లో మాట్లాడిన టేపులు కూడా బయటపడడం వారిని ఎటూ పాలుపోకుండా చేసింది.
 
జాతీయస్థాయి నాయకులు, కేంద్ర మంత్రులు మొదలుకుని ఈ వ్యవహారంపై మీడియా ఎదుట స్పందించేందుకు జంకుతున్నారు. ఒక కేంద్ర మంత్రి అయితే అసలు రేవంత్‌రెడ్డి వ్యవహారమే తనకు తెలియదంటూ తప్పించుకున్నారు. చంద్రబాబు టేపులపై మీడియా ఎదుట స్పందిస్తే దానిని ఒప్పుకోవడమో లేదా చట్టం తన పని చేసుకుపోతుందనో తాము  చెప్పాల్సి ఉంటుందని బీజేపీ నేత ఒకరు వాపోయారు. అందువల్ల అసలు దేనిపైనా స్పందించకుండా మౌనం పాటించడం, మీడియా వారి కెమెరాలు ఎదురైనపుడు తప్పించుకు తిరగడమే మంచిదని వారు భావిస్తున్నారు. మిత్రపక్షం టీడీపీ తీరుపై స్పందించలేక, అట్లాగని అసలు ఏమీ మాట్లాడకుండా పరోక్షంగా మద్దతునిచ్చినట్లుగా తమ పరిస్థితి తయారైందని అంతర్గత సమావేశాల్లో మొత్తుకుంటున్నారట...!

మరిన్ని వార్తలు