పాపం.. తెలుగు బీజేపీ! 

23 Nov, 2023 05:36 IST|Sakshi

టీడీపీని బతికించడమే అజెండాగా అడుగులు 

పోలీసులను కొట్టిన కేసులో టీడీపీ నేత బీటెక్‌ రవి అరెస్ట్‌ 

రెండు గంటల్లోనే మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు 

పోలీసులు కొట్టి ఉంటే మేజిస్ట్రేట్‌కు ఎందుకు చెప్పలేదు? 

టీడీపీ నేతను అరెస్ట్‌ చేస్తే బీజేపీ నేత సీఎం రమేశ్‌ పరామర్శా! 

రవిని కొట్టారని, బెదిరించారని దు్రష్పచారం ఎవరి కోసం? 

వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా మారిన సీఎం రమేశ్‌ 

చంద్రబాబు పన్నాగంతోనే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రాజకీయం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కుంగి, కృశించిపో­తున్న టీడీపీని బతికించడానికి ‘తెలుగు బీజేపీ’ నేతలు దింపుడు కల్లం ఆశతో పడరాని పాట్లు పడు­తు­న్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి టీడీపీకి రాజకీయ ప్రయోజనం కలిగించేలా రోజుకో కొత్త ఎత్తుతో రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రజల్లో ఏమాత్రం ప్రభావం చూపించకపోవడంతో తాజాగా మరో బీజేపీ నేత సీఎం రమేశ్‌ రంగంలోకి దిగారు.

పోలీసులపై దాడికి పాల్పడ్డ కేసులో న్యాయస్థానం ఆదేశాలతో కడప సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న బీటెక్‌ రవిని మంగళవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లా­డుతూ బీటెక్‌ రవిని అంతమొందించేందుకే పోలీ­సులు తీవ్రంగా కొట్టా­రని చెప్పారు. ‘బతికుంటే కదా పులివెందులలో పోటీ చేసేది’ అని హెచ్చరించారని ఆరోపించడం విడ్డూరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం ద్వారా టీడీపీకి రాజకీయ ప్రయోజనం కల్పించాలన్న ఆతృత తప్ప ఆయన ఆరోపణల్లో ఎలాంటి పస లేదన్నది స్పష్టమ­వుతోంది.  

పోలీసులపై దాడి చేస్తే అరెస్ట్‌ చేయరా?
పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పోరు­మా­మిళ్ల రవీంద్రనాథ్‌ రెడ్డి (బీటెక్‌ రవి) పోలీసులపై దాడి చేయడంతో ఆయన్ను వైఎస్సార్‌ జిల్లా పోలీ­సులు ఈ నెల 14న అరెస్ట్‌ చేశారు. విమానాశ్రయం వద్ద ఓ కానిస్టేబుల్‌పై దాడి చేసినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల నుంచి కడపకు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేసి, యోగి వేమన విశ్వ­విద్యా­లయం సమీపంలో ఆయన్ను అదుపులోకి తీసు­కున్నారు. అయితే టీడీపీ అనుకూల మీడియా దాన్ని రాద్ధాంతం చేసింది.

బీటెక్‌ రవిని పోలీసులు కిడ్నాప్‌ చేశారంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది. దీనికి వత్తాసు పలుకుతూ సీఎం రమేశ్‌ మరింతగా వక్రీకరించేందుకు యత్నించారు. పోలీసులు బీటెక్‌ రవిని కిడ్నాప్‌ చేశారని, ఏకంగా హత్య చేసేందుకు యత్నించారని ఆరోపించడం విడ్డూరంగా ఉంది. బీటెక్‌ రవిని అరెస్ట్‌ చేసిన రెండు గంటల్లోనే పోలీసులు  ఆయన్ను కడప ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. ఆ సమయంలో పోలీసులు తనను కొట్టారని ఆయన మేజిస్ట్రేట్‌కు చెప్పలేదు. గాయాలను చూపించలేదు.

‘పులివెందులలో పోటీ చేయా­లంటే ముందు బతికి ఉండాలి కదా’ అని తనను బెదిరించినట్టూ చెప్ప లేదు. చెప్పి ఉంటే మేజిస్ట్రేట్‌ ఆయన ఆరోపణలను రికార్డ్‌ చేసేవారు. కానీ బీటెక్‌ రవి అలా చెప్పలేదు. ఎం­దుకంటే పోలీసులు ఆయన్ను కొట్ట లేదు.. బెదిరించ లేదు.. హత్యా­యత్నం చేయ లేదు. అరెస్ట్‌ చేశాక కడప రిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన శరీరంపై గాయాలు ఉన్నట్టు వైద్య నివేదికలో లేనే లేదు.

అయితే  బీటెక్‌ రవిని పోలీసులు కిడ్నాప్‌ చేసి తీవ్రంగా కొట్టారని. ఏకంగా హత్య చేసేందుకు యత్నించారని.. టీవీ చానళ్లలో స్క్రోలింగులు రావడంతో విడిచి పెట్టారని సీఎం రమేశ్‌ చెప్పడం విడ్డూరంగా ఉంది. పోలీసులపై దాడి చేసినా కూడా బీటెక్‌ రవిని అరెస్ట్‌ చేయకూడదని రమేశ్‌ వత్తాసు పలుకుతుండటం విస్తుగొలుపుతోంది.

చంద్రబాబు కనుసైగ మేరకే..
సీఎం రమేశ్‌ ఉండేది బీజేపీ­లో.. పని చేసేది మాత్రం చంద్ర­బాబు రాజకీయ ప్రయో­జ­నాల కోసం అన్నది బహిరంగ రహస్యం. వైఎస్సార్‌ జిల్లా టీడీపీకి ఆయనే పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో జిల్లా టీడీపీ నేతల పాత్ర నామ­మాత్రం. పెత్తనం అంతా సీఎం రమేశ్‌దే. కడప జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న టీడీపీ నేత బీటెక్‌ రవిని పరామర్శించడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ ప్రభుత్వ హయాంలో వీరిద్దరి జోడి చేయని అక్రమాలు లేవు. సీఎం రమేశ్‌ అండదండల­తోనే బీటెక్‌ రవి యథేచ్ఛగా దందాలు, దౌర్జన్యాలకు పాల్పడే­వారు.

వీరి­ద్దరికీ చంద్రబాబు ఆశీ­స్సులు పుష్క­లం. అందువల్లే బీటెక్‌ రవిని సీఎం రమేశ్‌ పరామర్శించడం.. అనం­తరం రాష్ట్ర ప్రభు­త్వంపై నిరాధార ఆరోప­ణలు చేయడం స్పష్టంగా కనిపి­స్తోంది. ఇదంతా చంద్రబాబు పన్నా­గంలో భాగమే. పులి­వెందుల, వైఎస్సార్‌ జిల్లా ప్రజ­లకు సీఎం రమేశ్, బీటెక్‌ రవి అక్రమాలు, దౌర్జన్యాల గురించి పూర్తి అవగాహన ఉంది. ఈ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రాజకీయాలకు త్వరలోనే గుణపాఠం చెబుతామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు