ఎమ్మెల్యే లక్ష్మణ్‌కు వింత అనుభవం

21 Jun, 2017 07:50 IST|Sakshi
ఎమ్మెల్యే లక్ష్మణ్‌కు వింత అనుభవం

కవాడిగూడ ప్రభుత్వ పాఠశాలకు నేత
మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టకపోవడంపై విస్మయం
అధికారుల నుంచి మంత్రి వరకు ఫోన్లు...


ముషీరాబాద్‌: కవాడిగూడ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం బడిబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముషీరాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కె.లక్ష్మణ్‌కు ‘అవాక్కయ్యే’ అనుభవం ఎదురైంది. పాఠశాలలో మంజూరు చేసిన మరుగుదొడ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చిందని ఉపాధ్యాయులను అడిగితే అసలు మొదలే కాలేదని సమాధానం చెప్పడంతో ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే డీఈఓ రమేష్‌కు ఫోన్‌ చేశారు. నిర్మాణాలు చేసే సిబ్బంది తమ దగ్గర లేనందున కలెక్టర్‌ చూస్తున్నారని ఒకసారి, సర్వశిక్ష అభియాన్‌ వారు పనులు చేస్తున్నారని మరోసారి రమేష్‌ సమాధానం ఇచ్చారు. దీంతో రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్, విద్యా సంచాలకులు కిషన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు.

అక్కడి నుండి కూడా అరకొర సమాధానమే రావడంతో విసిగిపోయిన లక్ష్మణ్‌ నేరుగా విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి ఫోన్‌ చేసి మాట్లాడారు. ‘అన్నా...ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు చేపట్టేందుకు ఆర్నెళ్ల క్రితం రూ. 4 కోట్లు మంజూరు చేశారు. విద్యా సంవత్సరం మొదలైనా ఇప్పటివరకు ఒక్క పనీ మొదలు పెట్టలేదు. ఎందుకని?’ అని ప్రశ్నించారు. అందుకు కడియం శ్రీహరి స్పందిస్తూ...‘లక్ష్మణ్‌..నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకు రంగులు వేయమని రూ. 60 కోట్లు మంజూరు చేశాం. ఇప్పటికీ పనులు జరగడం లేదు. ఏం చేద్దాం.కొన్ని సమస్యలున్నాయి. మీరు నా దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని సీరియస్‌గా  తీసుకుంటాం. ముషీరాబాద్‌ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించేలా చూస్తాను’ అని సమాధానమిచ్చారు.

మరిన్ని వార్తలు