కేంద్ర మాజీమంత్రి దత్తన్నకు పుత్రశోకం

24 May, 2018 04:25 IST|Sakshi
దత్తాత్రేయను ఓదారుస్తున్న గవర్నర్‌ నరసింహన్, వైష్ణవ్‌ భౌతికకాయం

భోజనం చేస్తూనే కుప్పకూలిన వైష్ణవ్‌

గుండెపోటుతో హఠాన్మరణం

నివాళులర్పించిన గవర్నర్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు

అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు  

సాక్షి, హైదరాబాద్‌: మాజీ కేంద్రమంత్రి, సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ పుత్రశోకంతో తల్లడిల్లిపోయారు. ఏకైక కుమారుడు వైష్ణవ్‌(21) మంగళవారం అర్ధరాత్రి హఠాన్మరణం చెందారు. రాత్రి 10.30 గంటల సమయంలో వైష్ణవ్‌ తన తండ్రి దత్తాత్రేయ, తల్లి వసంత, సోదరి విజయలక్ష్మీ కలసి ఇంట్లో భోజనం చేస్తున్నారు. వైష్ణవ్‌ ఒక్కసారిగా పక్కనే ఉన్న సోదరిపైన కుప్పకూలిపోయాడు. ఫిట్స్‌ వచ్చి ఉండవచ్చని భావించిన కుటుంబసభ్యులు వైష్ణవ్‌ను హుటాహుటిన ముషీరాబాద్‌ గురునానక్‌ కేర్‌ ఆస్పత్రికి తరలించారు.

‘మీరు అవసరం లేదు, మేము చూసు కుంటాం’అని వైద్యులు దత్తాత్రేయకు నచ్చచెప్పి ఇంటికి పంపించేశారు. ఆసుపత్రికి వచ్చే సమయానికే వైష్ణవ్‌ పల్స్‌రేటు పూర్తిగా పడిపోయినట్లు వైద్యులు గుర్తించారు. అత్యవసర వైద్యసేవలను అందజేసినా గుండె స్పందించలేదు. తాత్కాలికంగా ఫేస్‌మేకర్‌ అమర్చినా ఎలాంటి స్పందన కనిపించలేదు. చివరకు వెంటిలేటర్‌ అమర్చారు. వైష్ణవ్‌ను కాపాడేందుకు 15 మంది వైద్యులు సుమారు 2 గంటలపాటు అన్ని విధాలుగా శ్రమించారు. అయినా అతన్ని కాపాడలేకపోయారు. అర్ధరాత్రి 12.30 గంటలకు ‘సడెన్‌ కార్డియాక్‌ అరెస్టు’తో వైష్ణవ్‌ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.  

ఉదయం వరకు తెలియదు...
కుమారుడు చనిపోయిన విషయాన్ని చెబితే పరిస్థితి ఎలా ఉంటుందోనని భావించిన వైద్యులు ఉదయం వరకూ ఆ విషయాన్ని దత్తాత్రేయకు చేరవేయలేదు. తీవ్ర అనారోగ్యం, గుండె బలహీనతతో బాధపడుతున్న దత్తాత్రేయ సతీమణి వసంతకు కూడా కొడుకు చనిపోయిన సంగతి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. రెండు, మూడు రోజుల్లో ఆమెకు ఫేస్‌మేకర్‌ అమర్చాల్సి ఉంది. చివరకు బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు మరణవార్త చెప్పడంతో వెంటనే దత్తాత్రేయ, వసంత, ఇతర కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని కుమారుడి భౌతికకాయాన్ని చూసి బోరున విలపించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి వారిని ఓదార్చడానికి విఫలయత్నం చేశారు.

ఉదయం 7 గంటలకు వైష్ణవ్‌ భౌతికకాయాన్ని రాంనగర్‌లోని నివాసానికి తరలించారు. అనంతరం దత్తన్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు, కుటుంబసభ్యులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య అంతి మయాత్ర సాగింది. మధ్యాహ్నం సైదాబాద్‌లోని ధోబీఘాట్‌ శ్మశానవాటికలో దత్తాత్రేయ చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగాయి. కుమారుడి కడసారి వీడ్కోలు సందర్భంగా దత్తాత్రేయతోపాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికి అందొచ్చిన ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో దత్తాత్రేయ సతీమణి గర్భశోకంతో తల్లడిల్లింది. అంత్యక్రియలకు కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

ప్రముఖుల సంతాపం...
దత్తాత్రేయ కుమారుడి మరణవార్త తెలిసిన వెంటనే ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ రాంనగర్‌ వచ్చి వైష్ణవ్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. దత్తాత్రేయను ఓదార్చారు. కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, సంతోష్‌ గాంగ్వర్, పలువురు రాష్ట్ర మంత్రులు దత్తాత్రేయను పరామర్శించారు.  

సీఎం సంతాపం
దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దత్తాత్రేయకు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు