తల్లి మందలించిందని.. ఇంట్లో నుంచి వెళ్లి.. చివరికి..

7 Nov, 2023 10:40 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి/గజ్వేల్‌: తల్లి మందలించిందని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ బాలుడు మరునాడు కాలువలో శవమై తేలిన ఘటన మండల పరిధిలోని దాతర్‌పల్లిలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నాయిని యాదగిరి–వాణి దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. వీరి పెద్దకొడుకు చరణ్‌(11) రిమ్మనగూడలోని పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు.

ఆదివారం తల్లిని డబ్బులు అడగడంతో చరణ్‌ను మందలించింది. దీంతో అతను ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. మరుసటి రోజు గ్రామ సమీపంలోని కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలో చరణ్‌ మృతదేహం గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాలువ వద్దకు వెళ్లిన పిల్లవాడు ప్రమాదవశాత్తు అందులోపడి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి చదవండి: ఇద్దరు కుమారులను పక్కింట్లో వదిలి, ఇంటికెళ్లి.. నోట్‌ బుక్‌లో రాసి..

మరిన్ని వార్తలు