బీజేపీ, ఎన్డీయేలను ఓడించాలి

15 Mar, 2019 02:35 IST|Sakshi

ప్రజలకు పిలుపునిచ్చిన సీపీఐ నేత సురవరం

ఫిరాయింపులతోనే అభివృద్ధా?: కేసీఆర్‌కు చాడ ప్రశ్న

సాక్షి, హైదరాబాద్‌: కార్పొరేట్‌ అనుకూల విధానాలతోపాటు దళితులు, మైనారిటీలపై దాడు లు పెరగడం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో వైఫల్యం, పేద, ధనిక వ్యత్యాసం మరింత పెరగడానికి కారణమైన బీజేపీ, ఎన్డీయేలను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి పిలుపునిచ్చారు. అబద్ధాల ద్వారానే మళ్లీ గెలుపొందాలని భావిస్తున్న బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీలకు సరైన సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల పాలనలో విఫలమైన బీజేపీ ఓటమి తప్పదనే భావనతో సైనిక జవాన్ల ఆత్మబలిదానాలను ఎన్నికల కోసం ఉపయోగించుకోవడం దారుణమన్నారు. దేశంలోని ప్రతిపక్షాలు సైన్యానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్నారం టూ ప్రధాని స్థాయి వ్యక్తి నీచమైన అబద్ధాలు చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు.

ఎన్నికల ప్రచారంలో సైనికుల ఫొటోలను ఉపయోగించకుండా ఈసీ నిషేధం విధించాలని డిమాండ్‌ చేశారు. గురువారం మఖ్దూంభవన్‌లో పార్టీ నాయకులు చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషాలతో కలిసి సురవరం విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో 55 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని సీపీఐ నిర్ణయించిందన్నారు. 18 సీట్లలో అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తయిందని, రెండు, మూడు విడతల్లో అభ్యర్థుల జాబితాలు విడుదల చేస్తామన్నారు. వామపక్షాలు బలంగా ఉంటేనే శ్రమజీవులకు, పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 12, 13 స్థానాల్లో ఈవీఎం లలో రికార్డయిన ఓట్లు, అభ్యర్థులకు వచ్చిన మెజారిటీల్లో తేడాలున్నందున, ఐదువేలలోపు మెజారిటీ వచ్చిన చోట్ల వీవీప్యాట్‌లను లెక్కించాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేశారు.  

ఫిరాయింపులతో అభివృద్ధి సాధ్యమా? 
రాష్ట్రంలో ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలోకి ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా నే అభివృద్ధి సాధ్యమవుతుందా అని సీఎం కేసీఆర్‌ను సీపీఐ కార్యదర్శి చాడ ప్రశ్నించారు. ప్రతిపక్షాల స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదన్నారు. పుల్వామా ఉగ్రదాడికి దారితీసిన ఇంటెలిజెన్స్‌ వైఫల్యానికి బాధ్యులెవరో చెప్పాలని అజీజ్‌పాషా డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు