నాలుగో సింహానికి మూడో నేత్రం

19 Jun, 2019 03:23 IST|Sakshi

శాంతి భద్రతల పోలీసులకు బాడీ వోర్న్‌ కెమెరాలు 

పోలీసింగ్‌లో మరింత పారదర్శకతే లక్ష్యం 

తొలుత జిల్లాల్లోని 10 స్టేషన్ల సిబ్బందికి పంపిణీ 

త్వరలోనే అన్ని పోలీస్‌స్టేషన్లకు

సాక్షి, హైదరాబాద్‌: ఫ్రెండ్లీ పోలీసింగ్, వుమెన్‌ ప్రొటెక్షన్‌ వింగ్‌ వంటి వినూత్న పద్ధతులతో ముందుకు సాగుతున్న రాష్ట్ర పోలీసులు మరో కొత్త ప్రయత్నా నికి శ్రీకారం చుట్టారు. పోలీసింగ్‌లో పారదర్శకత తీసుకువచ్చేందుకు శాంతి భద్రతల విభాగం పోలీసులకు బాడీ వోర్న్‌ కెమెరా లేదా చెస్ట్‌ మౌంటెడ్‌ కెమెరాలు ఇవ్వనున్నారు. ఇవి స్థానిక ఎస్పీ, కమిషనరేట్లతో పాటు, డీజీపీ ఆఫీసుకు కూడా అనుసంధానమై ఉంటాయి. ఫలితంగా ఘటనాస్థలంలో జరుగుతున్న కార్యక్రమాలను డీజీపీ కార్యాలయంలో ఉన్నతాధికారులు కూడా ప్రత్యక్షంగా వీక్షించగలరు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని త్వరలోనే అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా తొలిదశలో అన్ని జిల్లాల్లోని ముఖ్యమైన 10 పోలీస్‌ స్టేషన్ల సిబ్బందికి వీటిని పంపిణీ చేశారు. తర్వాత అన్ని పోలీస్‌ స్టేషన్లకు అందజేస్తారు. అందజేసిన సిబ్బందికి హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో వీటి వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. 

రాజధానిలో ఫలితాలివ్వడంతో..! 
చెస్ట్‌ మౌంటెడ్‌ కెమెరాలు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ విభాగం పోలీసులు చాలా కాలం నుంచే అమలు చేస్తున్నారు. రాజధానిలో ధర్నాలు జరిగినప్పుడు వీటిని సివిల్‌ పోలీసులు వినియోగించారు. హైదరాబాద్‌లో సత్ఫలితాలు ఇవ్వడంతో అన్ని జిల్లాలు, కమిషనరేట్లకు పంపిణీ చేయాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. పోలీసుల్లో జవాబుదారీతనం పెంచేందుకు, ఘటనాస్థలంలో సాక్ష్యాధారాల సేకరణకు ఈ విధానం దోహదపడనుంది. ఆందోళనలు, అల్లర్లు, విపత్తులు సంభవించినప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న విషయం ఫోన్లు, వాకీటాకీల ద్వారానే చెప్పే వీలుంది. ఈ విధానం ద్వారా ఉన్నతాధికారులు వేగంగా స్పందించి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చే వీలుంటుంది.

ప్రత్యేకతలేంటి? 
విదేశాల్లో వీటి వినియోగం ఎప్పట్నుంచో ఉంది. వీటికి 3జీ, 4జీ, ఆడియో, వీడియో సదుపాయంతో పాటు జీపీఎస్‌ కనెక్షన్‌ ఉంటుంది. రికార్డింగ్‌ బటన్‌ ఆప్షన్‌తో పాటు 400 నుంచి 500 గ్రాముల బరువు ఉంటాయి. ఈ కెమెరాలను భుజానికి ధరించేందుకు వీలుగా రూపొందిం చారు. వీటిని స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో) ఆదేశాల మేరకు సిబ్బంది వినియోగిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ట్రాఫిక్‌ పోలీసులతో పాటు రైల్వే పోలీసులు వీటిని వాడుతున్నారు.  

మరిన్ని వార్తలు