‘బోగస్‌’ ఏరివేత..!

17 Sep, 2018 09:45 IST|Sakshi
తోషం గ్రామంలో ఓటరు జాబితాను పరిశీలిస్తున్న కలెక్టర్‌

ఆదిలాబాద్‌అర్బన్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పెద్ద మొత్తంలో ఓట్లు తొలగింపునకు గురయ్యాయి. నాలుగు జిల్లాల పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో నాలుగేళ్ల కాలంలో 2,05,174 మంది బోగస్‌ ఓటర్లను తొలగించినట్లు ఆయా జిల్లాల ఎన్నికల అధికారుల వద్ద లెక్కలున్నాయి. ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గంలో అత్యధికంగా 92,337 ఓట్లు ఏరివేతకు గురయ్యాయి. దీంతో 2014లో ఉమ్మడి జిల్లా ఓటర్ల సంఖ్యకు.. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య పొంతన లేకుండా పోయింది. 2015లో స్పెషల్‌ సమ్మరి రివిజన్, 2017లో ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఆఫ్‌ ఎలక్ట్రోరల్‌ రోల్‌(ఐఆర్‌ఈఆర్‌) కార్యక్రమాల ద్వారా బోగస్‌ ఓటర్లను ఏరి వేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఇవి కాకుండా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా జిల్లాల్లో మరో రెండు సార్లు ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాలు చేపట్టి అర్హులైన వారిని నమోదు చేశారు. కానీ యువత నుంచి స్పందన రాక లక్ష్యానికి అనుగుణంగా ఓటర్లు నమోదు కాలేదు. అంటే ఓటర్ల తొలగింపుపై కనబర్చిన శ్రద్ధ.. ఎన్నికల అధికారులు నమోదులో చూపలేదని స్పష్టంగా అర్థమవుతోంది. తొలగిపోయిన ఓటర్లలో చనిపోయిన వారు, రెండేసి గుర్తింపు కార్డులు ఉన్న వారు.. వలస వచ్చి ఇక్కడే ఉంటున్న వారు ఉన్నారు. వీరితోపాటు కొందరు అర్హులైన ఓటర్లు కూడా తొలగిపోయారని దృష్టికి రావడంతో అప్పట్లో ఆదిలాబాద్‌లో దుమారం రేగింది. అర్హులుగా ఉంటే ఈ నెల 25 వరకు నమోదు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. నిరంతరంగా కొనసాగుతూ వస్తున్న నమోదు కార్యక్రమాల ద్వారా ఓటర్ల సంఖ్య పెరగాలి కానీ తగ్గిపోవడం ఇక్కడ గమనించదగ్గ విషయం.


2,05,174 ఓట్ల తొలగింపు.. 
2014 ఏప్రిల్‌ 16న విడుదల చేసిన ఓటర్ల ఫైనల్‌ డాటాబేస్‌ ప్రకారం ఉమ్మడి జిల్లాలో 19,59,660 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో ఏడు నియోజకవర్గాల్లో 2,05,174 బోగస్‌ ఓటర్లను వివిధ కారణాలతో తొలగించారు. మిగతా 17,54,486 మంది ఓటర్లను అర్హులుగా తేల్చారు. ఈ నాలుగేళ్ల కాలంలో చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమాల ద్వారా నాలుగు జిల్లాల్లో కేవలం 12,679 మంది యువతే కొత్తగా జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో అర్హత గల ఓటర్ల సంఖ్య 17,67,165కు చేరింది. ఈ జాబితానే 2018 సె ప్టెంబర్‌ 1న ముసాయిదా జాబితాగా నాలుగు జి ల్లాలో విడుదల చేశారు. ఈ తొలగింపులు, కొత్త ఓటరు నమోదులు, సవరణ ప్రక్రియలు ఆయా జిల్లాలో పరిధిలోనే జరిగాయి. ఓటర్లు తొలగిపోయిన ఏడునియోజకవర్గాలను ఓసారి పరిశీలిస్తే.. 

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా..

  • సిర్పూర్‌ : ఈ నియోజకవర్గంలో 2014లో 1,90,722 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం 1,79,292 మంది ఓటర్లు ఉండగా, మిగతా 11,430 ఓట్లు తొలగించబడ్డాయి. తొలగిపోయిన ఓట్లలో 5,349 మంది పురుషులు ఉండగా, 6,084 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
  • బెల్లంపల్లి : ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 2014లో 1,60,960 మంది ఓటర్లుగా ఉండగా, ప్రస్తుతం 1,55,153 మంది ఓటర్లు ఉన్నారు. అంటే 5,807 ఓట్లను అధికారులు తొలగించారు. తొలగిపోయిన వారిలో 2,779 మంది పురుషులు ఉండగా, 3028 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
  • మంచిర్యాల: ఈ నియోజకవర్గంలో 2014లో 2,38,423 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం 1,46,086 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా 92,337 ఓట్లు తొలగించబడ్డాయి. తొలగిపోయిన వారిలో 48,425 మంది పురుషులు ఉండగా, 43,896 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
  • ఖానాపూర్‌ : ఈ నియోజకవర్గంలో 2014లో 1,86,435 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం 1,78,715 మంది ఓటర్లు ఉన్నారు. అంటే 7,720 ఓట్లు తొలగించబడ్డాయి. తొలగిపోయిన వారిలో 2699 మంది పురుషులు ఉండగా, 5,048 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
  • ఆదిలాబాద్‌ : ఈ నియోజకవర్గంలో 2014లో 2,23,175 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం 1,73,951 మంది ఓటర్లు ఉన్నారు. ఏకంగా 49,224 ఓట్లు తొలగించబడ్డాయి. ఇందులో 26,630 మంది పురుషులు ఉండగా, 22,590 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
  • నిర్మల్‌ : ఈ  నియోజకవర్గంలో 2014లో 2,10,094 మంది ఓటర్లు ఉండగా, 1,86,512 మంది ఓటర్లు ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాక 23,582 మంది ఓటర్లు తొలగిపోయాయి. తొలగిపోయిన వారిలో పురుషులు 11,222 మంది ఉండగా, 12,363 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
  • ముథోల్‌ : ఈ నియోజకవర్గంలో 2014లో 2,08,805 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం 1,93,731 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నాలుగేళ్లలో 15,074 మంది ఓట్లను తొలగించారు. తొలగిపోయిన వారిలో 6,984 మంది పురుషులు ఉండగా, 8,088 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇవే కాకుండా 22 ఇతర ఓటర్లు (థర్డ్‌ జెండర్‌) ఉన్నారు. తొలగించబడిన వారిలో చని పోయిన వారు సుమారు 35,670 మంది ఉండగా, మిగతా వారందరు వలస వచ్చి ఇక్కడ ఉం టున్న వారు, రెండేసి ఓట్లున్న వారు, బోగస్‌గా గుర్తించిన ఓట్లని అధికారులు పేర్కొంటున్నారు.


మూడు నియోజకవర్గాల్లో పెరుగుదల 
ఉమ్మడి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఈ నాలుగేళ్ల కాలంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. చెన్నూర్‌ నియోజకవర్గంలో నాలుగేళ్లలో 1,897 మంది ఓటర్లు పెరగగా, అసిఫాబాద్‌లో 10,271 మంది పెరిగారు. ఇక బోథ్‌ నియోజకవర్గంలో తక్కువగా 511 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారుల రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
 
నాలుగేళ్లలో 12,679 మందే నమోదు.. 
ఎన్నికల సంఘం ప్రతీ ఏడాది అన్ని జిల్లాల్లో అక్టోబర్, నవంబర్‌ మాసాల్లో ఓటరు సవరణ కార్యక్రమాలను చేపడుతూ వస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా అధికారులు కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తులు స్వీకరించడంతోపాటు కార్డుల్లో మార్పులు, చేర్పులు, తొలగింపులు, చిరునామాల మార్పులకు  అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ నాలుగేళ్లు జరిగిన సవరణ కార్యక్రమాల ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12,679 మందే నమోదైనట్లు కన్పిస్తోంది.

2014లో ఉమ్మడి జిల్లాలో 19,59,660 మంది ఓటర్లు ఉంటే ఇందులోంచి 2,05,174 మంది తొలగించబడ్డాయి. మిగతా 17,54,486 మంది అర్హులుగా తేలారు. 2018 సెప్టెంబర్‌న విడుదల చేసిన జాబితా ప్రకారం 17,67,165 మంది ఓటర్లు ఉన్నారు. అంటే ఈ నాలుగేళ్ల కాలంలో 12,679 మంది మాత్రమే ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని చెప్పవచ్చు. జనాభా ప్రతిపాదికన ప్రతియేడాది లక్ష్యం మేరకు ఓటర్లను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఎన్నికల సంఘం ప్రతి యేడాది నమోదు చేపడుతోంది. ప్రతీ యేడాది ఓటర్ల సంఖ్య పెరుగుతూ రావాలి. కానీ ఉన్న ఓటర్లు తగ్గిపోవడం శోచనీయం.
 
ఫలితాలివ్వని నమోదు కార్యక్రమాలు.. 
ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన లేకపోవడమో.. అధికారుల ప్రచారలోపమో మొత్తానికి ఓటర్ల నమోదు కార్యక్రమాలు ఫలితాలివ్వడం లేదు. గత నాలుగేళ్లుగా ఈ కార్యక్రమాలు చేపట్టిన యువత ముందుకు గమనార్హం. పద్దెనిమిదేళ్లు నిండిన యువత నమోదు చేసుకోవడం లేదా.. లేక వారికి తెలియడం లేదా అనేది అధికారులకు కూడా అంతుచిక్కడం లేదని తెలుస్తోంది. విద్యార్థి దశ నుంచే ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్న స్పందన రావడం లేదు. ఎన్నికల సమయంలో నమోదుపై హడావుడి చేయడం తప్పా మిగతా సమయాల్లో పట్టించుకున్న పాపన పోవడం లేదు. దీంతో ఒకేసారి యువత స్పందించి నమోదు చేసుకోవాల్సి రావడంతో వలన వచ్చిన వారు, ఒక్కొక్కరు రెండేసి చోట్ల నమోదు చేసుకోవడం లాంటివి జరుగుతున్నాయి. దీంతో మళ్లీ వారిని బోగస్‌గా గుర్తించాల్సి వస్తోందని సమాచారం. 

మరిన్ని వార్తలు