రూ.1100 కోట్ల రుణాలకు బ్రేక్‌

18 Nov, 2017 02:53 IST|Sakshi

ఆగిన రికవరీ, స్త్రీనిధి రుణ వితరణ

సెర్ప్‌ ఉద్యోగుల  సమ్మె ఎఫెక్ట్‌

20న ‘చలో హైదరాబాద్‌’

సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఉద్యోగుల నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 19వ రోజుకు చేరింది. తమ డిమాండ్ల సాధన కోసం 4,264 మంది ఉద్యోగులు విధులకు దూరంగా ఉండటం.. ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో సెర్ప్‌ పథకాలు చతికిలబడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 4.60 లక్షల స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)లోని 51 లక్షల మంది మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడంలో సెర్ప్‌ది కీలక భూమిక. ఒక్కసారిగా ఉద్యోగులు ఆందోళనబాట పట్టడంతో సంఘాల లావాదేవీలన్నీ స్తంభించిపోయాయి.

మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల అందజేత అటకెక్కడంతో డబ్బులకు తీవ్ర కటకట ఏర్పడింది.  2017–18లో ఎస్‌హెచ్‌జీలకు రూ.7 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందజేయాలన్నది లక్ష్యం. ఈ ఒక్క నెలలోనే రూ.1,100 కోట్ల రుణ వితరణ జరగాల్సి ఉండగా.. సమ్మె కారణంగా అది సాధ్యపడలేదు.  ఇప్పటి వరకు రూ.38 వేల కోట్ల అప్పు ఎస్‌హెచ్‌జీలపై ఉంది.  రూ.500 కోట్ల  రుణ రికవరీ కూడా ఆగిపోయింది.  ఈ నెలలో సుమారు రూ.120 కోట్ల స్త్రీనిధి రుణాలకు మహిళలు నోచుకోలేకపోయారు. సీఎం కేసీఆర్‌ సెర్ప్‌న కు చైర్మన్‌గా వ్యవహరిస్తుండటం కొసమెరుపు. 

మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు..
కొన్ని జిల్లాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిగా మూత బడ్డాయి. సదరం క్యాంపులదీ అదే దారి.  ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చేయడం, మరుగుదొడ్ల నిర్మాణం తదితరాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. మరోవైపు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సెర్ప్‌ ఉద్యోగ సంఘాల జేఏసీ నడుం బిగించింది. ఈ నెల 20న ‘చలో హైదరాబాద్‌కు’పిలుపునిచ్చింది. ఒక్కో ఉద్యోగి 25 మంది ఆత్మీయులతో కలసి హాజరయ్యేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. 

మరిన్ని వార్తలు