అంబేడ్కర్‌ విగ్రహం కోసం ఉద్యమిస్తాం: కోదండరాం

15 Apr, 2019 02:46 IST|Sakshi

పెద్దపల్లి: దేశ ప్రజల స్వేచ్ఛ, సమానత్వం గురించి ఆలోచించిన గొప్ప నాయకుడు డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ అని తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. కోట్లాది మంది ఆరాధిస్తున్న అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసి డంపింగ్‌ యార్డులో పడవేయడం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించి దానిని ఏర్పాటు చేయకపోగా ఉన్న విగ్రహాలకు రక్షణ కల్పించడంలో విఫలమైం దని ఆరోపించారు. 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం కోసం దళిత మేధావులతో కలసి ఉద్యమిస్తామని తెలిపారు.   

విగ్రహాన్ని తరలించిన వ్యక్తుల రిమాండ్‌ 
హైదరాబాద్‌: బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసి చెత్త లారీలో తరలించిన ఇద్దరు వ్యక్తులపై జవహర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 13న పంజగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని అనుమతి లేదంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగించారు. అనంతరం విగ్రహాన్ని ధ్వంసం చేసి చెత్త లారీలో జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు తరలిçస్తున్నారన్న సమాచారం అందుకుని దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చెత్త లారీలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్‌ డప్పు రాజ (35), ఇటాచీ డ్రైవర్‌ భీంగుప్త(29)ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. యూసఫ్‌గూడ డంపింగ్‌యార్డు సూపర్‌వైజర్లు బాలరాజు, శ్రీకాంత్‌లతో పాటు జీఎహెచ్‌ఎంసీ అధికారులపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.    

మరిన్ని వార్తలు