కొత్తపల్లి–మనోహరాబాద్‌కు లైన్‌క్లియర్‌ 

12 Jul, 2019 12:28 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించింది. కరీంనగర్‌ నుంచి నేరుగా హైదరాబాద్‌కు వెళ్లేందుకు వీలుగా కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ను 2006–07 సంవత్సరంలో రూ.1160 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం రైల్వేబడ్జెట్‌లో సరిపడా నిధులు కేటాయించకపోవడంతో పనులు నత్తనడకన సాగాయి. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2014 సంవత్సరం నుంచి రైల్వేపనుల్లో వేగం పెరిగింది.

మొత్తం 150 కిలోమీటర్ల దూరం ఉన్న కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వేలైన్‌లో ప్రస్తుతం మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు 32 కిలోమీటర్లు మాత్రమే పనులు పూర్తయ్యాయి. 2020 సంవత్సరంనాటికి కరీంనగర్‌కు రైలు తీసుకొస్తామన్న ప్రజాప్రతినిధుల మాటలు ఆచరణలో మాత్రం సాధ్యమయ్యే పరిస్థితి కన్పించడంలేదు. ఈ రైల్వే నిర్మాణ పనులు కరీంనగర్‌ జిల్లాలో ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుత బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ హయాంలోనైనా కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ నిర్మాణం పూర్తవుతుందనే ఆశాభావంతో జిల్లాప్రజలున్నారు.  

బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు ఇలా  
► 2015–16–రూ.20కోట్లు 
► 2016–17–రూ.30కోట్లు 
► 2017–18–రూ.350కోట్లు  
► 2018–19–రూ.125కోట్లు 
► 2019–20–రూ.200కోట్లు 

మరిన్ని వార్తలు