అదిగదిగో..అదే పిల్లల మర్రి

22 Aug, 2018 12:11 IST|Sakshi
పిల్లలమర్రిని చూసేందుకు నిర్మిస్తున్న కెనోపివాక్‌ బ్రిడ్జి

పిల్లలమర్రిని దూరం నుంచి చూడాల్సిందే!

ప్రవేశద్వారం వద్ద   కెనోపివాక్‌ బ్రిడ్జి నిర్మాణం

త్వరలోనే సందర్శకులకు అనుమతి

చెట్టు పునరుజ్జీవానికి సాగుతున్న ట్రీట్‌మెంట్‌ స్టేషన్‌

మహబూబ్‌నగర్‌ :  వందల ఏళ్ల క్రితం మొలకెత్తిన మొలక శాఖోపశాఖలుగా విస్తరించి మొదలు ఎక్కడ ఉం దో గుర్తు పట్టలేనంత మహా వృక్షంగా ఎదిగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకే తలమానికంగా నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉన్న మహా మర్రి వృక్షం(పిల్లలమర్రి) పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంది. అయితే, ఓ భారీ కొమ్మ గత ఏడాది డిసెంబర్‌ 16న విరిగిపడింది. దీంతో భారీ వృక్షం సంరక్షణకు ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ ద్వారా చికిత్స ప్రారంభించిన అధికారులు.. మిగతా ఏ కొమ్మ కూడా విగరకుండా పిల్లర్లు నిర్మించారు.

అయితే, సందర్శకులను లోనకు రానివ్వడం వల్ల చెట్టు కాండం, పిల్ల కొమ్మలపై రాతలు రాస్తూ, గుర్తులు పెడుతుండడంతోనే ఉనికికి ముప్పు వాటిల్లుతోం దని భావించి ట్రీట్‌మెంట్‌ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరినీ అనుమతించలేదు. కాగా, ట్రీట్‌మెంట్‌ పూర్తయ్యేందుకు ఇంకా సమయం పట్టే అవకాశముండడంతో సందర్శకులకు నిరాశకు గురి చేయకుండా పిల్లలమర్రిని సందర్శించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రా రంభించారు. ఇందులో భాగంగా ప్రధాన ద్వారం వద్ద బయటి భాగంలో ’కెనోపివాక్‌’ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. తద్వారా ఈ బ్రిడ్జి పైనుంచి నడుస్తూ పిల్లలమర్రిని చూసే అవకాశం కలగనుంది.  

ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ 

పిల్లలమర్రి చెట్టుకు సంబంధించిన ఓ ప్రధాన భారీ కొమ్మ గత ఏడాది డిసెంబర్‌ 16వ తేదీన విరిగిపడడంతో పాటు మరికొన్ని కొమ్మలు విరిగే దశకు చేరుకున్నాయి. దీంతో అధికారులు స్పందించి ట్రీట్‌మెంట్‌ను ప్రారంభించారు. విరిగిన కొమ్మ వద్ద గోడ కట్టి ఎర్ర మట్టితో కప్పారు. చెట్టుకు పూర్తిస్థాయిలో ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన తర్వాత పిల్లలమర్రిలో పర్యాటకులకు అనుమతించాలని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ అప్పట్లో ఆదేశించారు. దీంతో డిసెంబర్‌ 20న పిల్లలమర్రి సందర్శనను నిలిపివేసి అటవీశాఖ ఆధ్వర్యాన ట్రీట్‌మెంట్‌ కొనసాగిస్తున్నారు.

అలాగే, కొమ్మలు విరుగుతున్న చోట సహాయంగా పిల్లర్లు నిర్మించారు. గతంలో సెలైన్లతో క్లోరోపైరిపస్‌ మందును చెట్టుకు అందించగా ప్రస్తుతం ప్రత్యేకంగా రూట్‌ ట్రైనర్‌ పైపుల్లో వర్మీ కంపోస్ట్, ఎర్ర మట్టి నింపి ఊడలకు సపోర్ట్‌గా ఏర్పాటు చేశారు. దాదాపు 45 పైపులు, 36 సిమెంట్‌ దిమ్మెలతో చెట్టు రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ చికిత్స ఫలితంగా ఇప్పుడిప్పుడే కొత్తగా ఊడలు వస్తున్నాయి.  

కెనోపివాక్‌ పైనుంచే అనుమతి  

గతంలో పిల్లలమర్రిలో పర్యాటకులు చెట్టు కొ మ్మలను చేతివేళ్లతో తాకడం, ఊడలపై కూర్చొవ డం వల్ల చెట్టు ఉనికికే ముప్పు ఏర్పడే ప్రమాదం ఎదురైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చెట్టుకు పూర్వవైభవం వచ్చేవరకు ప్రత్యేకంగా కెనోపివాక్‌ బ్రిడ్జి ద్వారా పిల్లలమర్రిని పర్యాటకులు చూసే ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలమర్రి గేటు బయట కెనోపివాక్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఎత్తైన రాడ్లపై ఒకసారి ఇద్దరు నడిచేలా బ్రిడ్జి నిర్మాణం సాగుతోంది. త్వరలోనే నిర్మాణ పనులు పూర్తికానుండగా పర్యాటకులను అనుమతిస్తారు.  

కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి  

పిల్లలమర్రి చెట్టుకు పూర్వవైభవం తీసుకురావడానికి జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎప్పటికప్పుడు చెట్టుకు అందుతున్న ట్రీట్‌మెంట్‌ పనులను పరిశీలిస్తూ అధికారులకు తగిన సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. కా గా, త్వరలోనే పిల్లలమర్రి సందర్శనకు అనుమతి ఇవ్వనుండడంపై జిల్లా వాసులే కాకుండా పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు