షాపింగ్ పూర్తయ్యేలోగా మీ కారు రీచార్జ్!

10 Aug, 2014 02:16 IST|Sakshi
షాపింగ్ పూర్తయ్యేలోగా మీ కారు రీచార్జ్!

* పెట్రోలు బంకుల తరహాలో రీ-చార్జీ స్టేషన్లు
* బ్యాటరీ కార్ల వాడకాన్ని పెంచాలని ప్రభుత్వ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది. బ్యాటరీ కార్ల వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా కాలుష్యాన్ని భారీగా తగ్గించేందుకు అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం పెట్రోలు బంకుల తరహాలో రీ-చార్జీ స్టేషన్లను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని యోచిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆలోచనను బ్యాటరీ కారు ‘రెవా’ను తయారుచేసిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీతో పంచుకున్నారు.
 
 
  ‘బ్యాటరీ కారును ఒకసారి పూర్తిగా రీ-చార్జీ చేస్తే 120 కిలోమీటర్ల వరకూ వెళుతుంది. అయితే, తర్వాత రీ-చార్జీ చేయాలంటే మళ్లీ ఇంటికే వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్స్‌తో పాటు ముఖ్యమైన ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సినిమా థియేటర్లు, సెంటర్ల వద్ద రీ-చార్జ్ స్టేషన్లను నెలకొల్పితే బ్యాటరీ కార్ల వాడకం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా షాపింగ్ ముగిసేలోగా కారు రీ-చార్జీ అవుతుంది. అలాగే ఏదైనా ఆఫీసు పని అయిపోయేలోగా కారు రీ-చార్జీ అవుతుంది. ఇలాంటి సదుపాయాలవల్ల బ్యాటరీ కార్ల వాడకం పెరుగుతుందనేది ప్రభుత్వ భావన. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం తనతో సమావేశమైన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. దీనిపై స్పందించిన కంపెనీ ప్రతినిధులు రీ-చార్జీ స్టేషన్లను నెలకొల్పేందుకు సిద్ధమని  ప్రకటించారు. ఇందుకోసం స్థలాలు కేటాయించాలని కోరారు. షాపింగ్ మాల్స్‌తో పాటు ముఖ్యమైన ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలవద్ద రీ-చార్జీ స్టేషన్లకు స్థలాన్ని కేటాయిస్తామని కేసీఆర్ హామీనిచ్చినట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు