‘ముంపు’తో మావోయిస్టుల ముప్పు! | Sakshi
Sakshi News home page

‘ముంపు’తో మావోయిస్టుల ముప్పు!

Published Sun, Aug 10 2014 2:17 AM

‘ముంపు’తో మావోయిస్టుల ముప్పు! - Sakshi

 కుక్కునూరు : మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలు ఆంధ్రలో విలీనమైన నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు.  మావోయిస్టుల కదలికలపై ఆరా తీస్తున్నారు. ఆ జిల్లాల్లో విలీనమైన ఏడు ముంపు మండలాల్లో 2005 నుంచి ఇప్పటి వరకు పలు ఘటనలు చోటుచేసుకోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆ మండలాలు విలీనమైన నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో కూడా మావోయిస్టుల ప్రాబల్యం ఉంటుందని ఆంధ్ర పోలీసులు భావిస్తున్నారు.

 ఛత్తీస్‌గఢ్ రాష్ర్ట మావోయిస్టులు ఇంతకు ముందు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిని సెంట్రల్‌జోన్‌గా చేసుకుని కార్యకలాపాలు సాగించారని, ఇప్పుడు ఏలూరును ఎంచుకున్నారని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల  పశ్చిమగోదావరి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె.రఘురామ్‌రెడ్డి జిల్లాలోని  పలు పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేసిన సందర్భంగా పోలీసులను అప్రమత్తంగా ఉండాలని  సూచించినట్లు తెలుస్తోంది.

 ఏడు మండలాల్లో పలు సంఘటనలు..
 ఆదివాసీల మనుగడను ముంచేస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని  మావోయిస్టులు మొదటి నుంచే డిమాండ్ చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు బదలాయించిన చింతూరుకు పక్కనే ఛత్తీస్‌గఢ్ ఉండడంతో మావోయిస్టులు, పోలీసుల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుండడం పరిపాటిగా మారింది. వీఆర్‌పురం మండలంలో 20 ఏళ్ల క్రితం కమ్యూనిస్టు పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులను, 2009లో కూనవరానికి చెందిన శ్రీమంతుల సీతారామారావును మావోయిస్టులు కాల్చి చంపినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి.

అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లాకు బదలాయించిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పదేళ్లలో ఐదారు ఘటనలు జరిగాయి. 2005లో కుక్కునూరులోని పోలీస్‌స్టేషన్ పేల్చివేతకు గురైంది. పారిటాకులంకలో 2006, 2007లలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగి ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 2007లో మండల పరిధిలోని తొండిపాకకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మండవ రామిరెడ్డిని మావోయిస్టులు కాల్చిచంపారు.

2008లో కుక్కునూరు, అశ్వారావుపేట, దమ్మపేట రిజర్వ్‌పారెస్ట్‌లో మావోయిస్టులకు సంబంధించిన సామగ్రి, మందుగుండు పోలీసులకు లభించిన సంఘటనలు ఉన్నాయి. 2010లో పోలవరం నిర్వాసతుల కోసం వేలేరుపాడు మండలంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మావోయిస్టులు కూల్చివేశారు. ఈ ఘటనల ద్వారా ముంపు మండలాల్లో మావోయిస్టులు పలుమార్లు తమ ఉనికిని చాటుకున్నారు. ఇప్పుడు ఆ ఏడు మండలాలు ఉభయగోదావరి జిల్లాల్లో కలవడంతో అక్కడి పోలీసులు అప్రమత్తమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా మావోయిస్టుల ప్రాబల్యంలేదని, తెలంగాణ నుంచి ఆంధ్రలో కలిసిన ముంపు మండలాలతోనే అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇటీవల ఏలూరులో పోలీసుల ప్రగతి సమీక్షా సమావేశంలో  చెప్పారు.

Advertisement
Advertisement