తొండుపల్లి టోల్‌గేటు వద్ద సీసీ కెమెరాలు

2 Dec, 2019 11:54 IST|Sakshi
తొండుపల్లి టోల్‌గేటు వద్ద సీసీ కెమెరాలు

శంషాబాద్‌లోని తొండుపల్లి ఘటనతోనైనా పోలీస్‌ శాఖ కళ్లు తెరిచేనా..

నాణ్యతలేని కెమెరాలతో ఫలితం అంతంతే.. 

ఆధారాల సేకరణకే పరిమితమైన సీసీ ఫుటేజీలు

కొన్నిచోట్ల కానరాని కెమెరాలు 

సాక్షి, శంషాబాద్‌: ‘సీసీ కెమెరాల ఏర్పాటు.. నేరం జరిగాక ఆధారాలు సేకరించడానికి కాదు.. నిరంతర పర్యవేక్షణతో నేరాల నియంత్రణకు వాటిని వినియోగించాలి.. సీసీ ఫుటేజీ రికార్డు కూడా స్పష్టంగా లేదు’ అని శంషాబాద్‌ ఘటన తర్వాత పోలీసుల తీరుపై జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు శ్యామల కుందన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.. రెండేళ్ల కిందట ఓ వృద్ధుడు నర్కూడ సమీపంలోని ఒయాసిస్‌ ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతని మెడ భాగంలో పదునైన ఆయుధంతో దాడిచేశారు. అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో ఇప్పటి వరకు నేరస్తులను గుర్తించలేదు. కారణమేమంటే ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడం. ఆరు నెలల కిందట నర్కూడలోని అమ్మ పల్లి దేవాలయంలో గుర్తుతెలియని దుండ గులు విగ్రహాలను ఎత్తుకెళ్లారు. ఇక్కడ ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు ఉండగా.. ఫుటేజీని నిక్షిప్తం చేసే హార్డ్‌ డిస్క్‌ను సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో దుండగుల ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది. నేరాల అదుపు, నియంత్రణలో భాగంగా నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది.

శంషాబాద్‌ మండల పరిధిలోని బెంగళూరు జాతీయ రహదారిలో ఔటర్‌ టోల్‌గేటు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీ రికార్డు స్పష్టంగా లేదని పేర్కొనడం ఆందోళన కల్గిస్తోంది. గత కొన్నేళ్ల నుంచి పోలీసులు దాతల సహకారంతో విడతల వారీగా రహదారులు, ప్రధాన రోడ్లు, కూడళ్లతో పాటు గ్రామాల్లో 1400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిలో చాలా వరకు ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌ తరహా కెమెరాలు ఉన్నాయి. వీటిని ఇంటర్‌నెట్‌ ద్వారా సెల్‌ఫోన్‌లకు అనుసంధానం చేసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయవచ్చు. ఈ కెమెరాలు హెచ్‌డీ కెమెరాల కంటే కూడా నాణ్యమైనవిగా పోలీసులు పేర్కొంటున్నారు. అయితే, ఔటర్‌ మార్గం, పరిసరాల్లో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కెమెరాల నాణ్యతపై ఆరోపణలు వస్తున్నాయి. తొండుపల్లి వద్ద జరిగిన ఘటనలో ఈ కెమెరాల్లో ఆధారాలు సరిగా రికార్డు కాలేదని మహిళా కమిషన్‌ సభ్యురాలు చెప్పడం గమనార్హం. 

తీరు మారేనా.. 

ఆదివారం తొండుపల్లి టోల్‌గేటు సమీపంలో రహదారి పక్కన నిలిపిన వాహనం 

పశు వైద్యురాలి హత్యోదంతం తర్వాత కూడా ఔటర్‌ టోల్‌గేటు వద్ద తీరు మారడం లేదు. శంషాబాద్‌లోని తొండుపల్లి వద్ద గత నెల 28న పశువైద్యురాలి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ టోల్‌గేట్‌ వద్ద సర్వీసు దారి లారీలకు అడ్డాగా మారడంతోనే ఈ దురాఘతం చోటు చేసుకుంది. ఇంత దారుణం చోటు చేసుకున్న తర్వాత కూడా లారీల పార్కింగ్‌ నివారణకు చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. తొండుపల్లి గ్రామం నుంచి సర్వీసు మార్గం వరకు దాదాపు 300 మీటర్ల దూరం పూర్తిగా లారీలకు అడ్డాగా మారింది. లారీ మాటున అమాయకురాలిని నమ్మించి దురాఘతానికి పాల్పడ్డారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తుండగా.. పోలీసులు మాత్రం ఆ దిశగా దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి చోట్ల సీసీ కెమెరాలతో నిఘాను ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ చేస్తే బాగుంటుందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఆదివారం తొండుపల్లి టోల్‌గేటు సమీపంలో రహదారి పక్కన నిలిపిన వాహనం

ఆన్‌లైన్‌ విధానం అమలు చేస్తే.. 
సీసీ కెమెరాలను పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేయాలంటే ఆన్‌లైన్‌ విధానం అమలులోకి రావాలి. ప్రస్తుతం ఆయా చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను స్థానికంగా ఉన్న పంచాయతీ కార్యాలయాల్లో హార్డ్‌ డిస్క్‌లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఇక్కడే కెమెరాలను పర్యవేక్షించేందుకు స్క్రీన్‌ ఏర్పాటు చేశారు. అయితే వీటి ద్వారా నేరాలకు సంబంధించిన ఆధారాలు సేకరించడానికి మాత్రమే అనువుగా ఉంటుంది. ఒక వేళ సీసీ కెమెరాలను ఆన్‌లైన్‌ విధానంలోకి తీసుకొస్తే కమాండ్‌ కంట్రోల్‌ నుంచి పర్యవేక్షించవచ్చు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కూడా వీటిని ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ.. అనుమానాస్పద వ్యక్తుల సంచారం, వాహనాల పార్కింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టే అవకాశాలుంటాయి. ఇక రాత్రి వేళల్లో వాహనాల లైట్లు కెమెరాలకు నేరుగా తాకడంతో ఆధారాలను రికార్డు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి చోట్ల కెమెరాలను వేరే కోణాల్లో అమర్చుకోవాల్సి ఉంది. 

కెమెరాలను మార్చాలని నివేదిక పంపిస్తున్నాం..
హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాటిని మార్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు హెచ్‌ఎండీఏ అధికారులకు సమాచారం ఇస్తున్నాం. శంషాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఉన్న కెమెరాల నిర్వహణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం కానిస్టేబుల్‌ను నియమించాం.   
– వెంకటేష్, సీఐ, శంషాబాద్‌ 

మరిన్ని వార్తలు