మసకబారుతున్న... ‘మూడో కన్ను’

17 Nov, 2018 10:09 IST|Sakshi

నిర్వహణ అస్తవ్యస్తం

భారీ సంఖ్యలో పని చేయని సీసీ కెమెరాలు

ఎన్నికల హడావుడిలో పట్టించుకునేదెవరు?

ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరుతున్న ప్రజలు

సాక్షి, సిటీబ్యూరో: నగర కమిషనరేట్‌ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య వందల్లో ఉంటే... ప్రజా భద్రతా చట్టం అమలులోకి వచ్చిన తరవాత కమ్యూనిటీల వారీగా ఏర్పాటు చేసినవి లక్షలకు చేరాయి. గత ఏడాది నగరంలో చోటు చేసుకున్న నేరాల్లో దాదాపు 3 వేలకు పైగా కేసుల దర్యాప్తునకు అవసరమైన ఆధారాలను సీసీ కెమెరాలే అందించాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ ‘మూడో కన్ను’ మసకబారుతోంది. కెమెరాలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నా... నిర్వహణ సరిగా లేక అందులో అనేకం కొరగాకుండా పోతున్నాయి. వీటిని ప్రజలు ఏర్పాటు చేసినా... కనీసం నిర్వహణ బాధ్యతనైనా ప్రభుత్వం చేపట్టాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల క్రతువు సజావుగా పూర్తి చేయడంలో సీసీ కెమెరాల పాత్ర సైతం కీలకం కావడంతో దీనిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.  

అందరి కళ్లూ కెమెరాల వైపే...
ప్రస్తుతం సిటీలో ఎలాంటి నేరం చోటు చేసుకున్నా పోలీసులు ప్రధానంగా సీసీ కెమెరాల పైనే ఆధారపడుతున్నారు. అంతటి ప్రాధాన్యం ఉన్న వీటి ఏర్పాటులోనూ అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. 2014లో అమలులోకి వచ్చిన ప్రజా భద్రత చట్టంలో భాగంగా వ్యాపార సముదాయాలు, వాణిజ్య ప్రాంతాల్లో వ్యక్తిగతంగా, కమ్యూనిటీ మొత్తం కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడాన్ని తప్పనిసరి చేశారు. అయితే ఎవరికి నచ్చిన మోడల్, సామర్థ్యం కలిగిన కెమెరాలను వారు ఏర్పాటు చేసుకోకుండా యూనిఫామిటీ కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. సీసీ కెమెరాలకు ఉండాల్సిన సామర్థ్యాలను నిర్దేశించి అంతా వాటినే ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో దాదాపు అన్నీ ఒకే తరహాకు చెందినవి సమకూరుతున్నాయి.  

అన్నింటినీ అనుసంధానించారు...
సీసీ కెమెరాల ఏర్పాటును పర్యవేక్షించే బాధ్యతలను పోలీసుస్టేషన్ల వారీగా ఆయా ఇన్‌స్పెక్టర్లకు అప్పగించారు. వ్యాపారులు, సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్న వీరు కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. ఓ వ్యాపార సముదాయం, వాణిజ్య కూడళ్లతో పాటు తమ దుకాణాల్లోనూ వ్యాపారులు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. దుకాణం లోపల మినహా బయట ఉన్న కెమెరాలన్నింటినీ బ్రాడ్‌బ్యాండ్‌ ద్వారా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో  (సీసీసీ) అనుసంధానించారు. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కెమెరాలూ ప్రధానంగా ట్రాఫిక్‌ కోణంలో పని చేస్తున్నా... అనుసంధానించిన కమ్యూనిటీ కెమెరాలూ నిఘా, శాంతిభద్రతల పర్యవేక్షణకు ఉపకరిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి సిటీలోని కెమెరాలను 2.5 లక్షలకు చేర్చాలని, అన్నింటినీ సీసీసీతో అనుసంధానించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.  

నిర్వహణే సమస్య...
ఇంతవరకు అంతా బాగానే ఉన్నా... కమ్యూనిటీ కెమెరాల నిర్వహణ విషయంలో సమస్య ఎదురవుతోంది. వ్యాపారులు, స్థానికులతో కెమెరాలు ఏర్పాటు చేయించిన పోలీసులు వాటిని నిర్వహించే అంశంలో మాత్రం స్పష్టత లేదు. స్థానికంగా అవి పని చేయడానికి అవసరమైన విద్యుత్, కనెక్టివిటీకి సంబంధించిన అంశాలు ఎవరి పరిధిలో ఉంటాయి? దీనికి అవసరమైన నిధుల విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ప్రస్తుతం సిటీలోని సీసీ కెమెరాల్లో అనేకం పని చేయడంలేదు. ఫలితంగా ఏదైనా నేరం జరిగితే ఆధారాల కోసం అన్వేషించడానికి ఎక్కువ సమయం పడుతోంది. కొన్నిసార్లు కష్ట సాధ్యంగానూ మారుతోందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఈ కెమెరాల పని తీరుపై నిత్యం సమీక్షలు జరిగేవి. అయితే ప్రస్తుతం అంతా ఎన్నికల హడావుడిలో ఉండటంతో పట్టించుకునే నా«థుడు కరవయ్యారు. కెమెరాలను తమ సొంత నిధులతో ఏర్పాటు చేయించామని, వాటి నిర్వహణ విషయాన్ని ప్రభుత్వలో బాధ్యత తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

మరిన్ని వార్తలు