నిధుల విడుదల ఎప్పుడో..!

22 Feb, 2015 02:05 IST|Sakshi

ఊరు పట్టదు... కడుపు నిండదు...
 
 గ్రామీణాభివృద్ధి పథకాలపై కేంద్ర, రాష్ట్రాల నిర్లక్ష్యం
 వివిధ ప్రాజెక్టులకు ఆగిపోయిన నిధులు
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి పూర్తిగా అటకెక్కింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు, విడుదల చేసిన సొమ్ముకు పొంతనలేకుండా పోయింది. తమ పథకాలకు నిధులు విడుదల చేయడంలో కేంద్రం జాప్యం చేస్తున్నా... రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకూ నిధుల విడుదలను కొండెక్కించింది. ఫలితంగా ‘ఉపాధి హామీ’, వాటర్‌షెడ్ వంటి పథకాలకూ తూట్లు పడుతున్నాయి.     
  - సాక్షి, హైదరాబాద్
 
 మిగిలేది నిరాశే
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2014-15లో గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు పథకాలకు పూర్తిస్థాయిలో నిధుల విడుదలలో నెలకొన్న జాప్యం పథకాల ఉద్దేశాన్ని దెబ్బతీస్తోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ ప్రోగ్రామ్ (ఐడబ్ల్యూఎంపీ) వంటి పనుల ద్వారా ఉపాధి లభిస్తుందని ఆశించిన పేదలకు నిరాశే మిగులుతోంది.
 
 తప్పెవరిది..?
 వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నుంచే అధిక మొత్తం నిధులు విడుదలవుతాయి. కేంద్రం ఇచ్చిన నిధులకు, రాష్ట్రం వాటాను కూడా కలిపి ఆయా పథకాల అమలుకు వినియోగిస్తారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా వంద శాతం సొంత నిధులతో గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా పలు పథకాలను అమలు చేస్తోంది. అయితే కేంద్రం నిర్లక్ష్య వైఖరి వల్ల విడుదల కావాల్సిన నిధులు పెద్దమొత్తంలో ఆగిపోవడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా నిధులను విడుదల చేయకపోతుండటంతో పలు ప్రాజెక్టులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.
 

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్రం కలిపి రూ.5,403 కోట్లను బడ్జెట్‌లో కేటాయించాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వానిదే అధిక వాటాకాగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా కింద నిధులను విడుదల చేయాల్సి ఉంది. అయితే గ్రామీణాభివృద్ధి కింద  ఇప్పటివరకు రూ. 3,261 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి.
 
 ఇప్పుడిచ్చినా.. ఫలితం కష్టమే
 మరో నెలరోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా బడ్జెట్ కేటాయింపుల్లో ఇంకా రూ. 2,142 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఓవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల కోసం ప్రజలు ఎదురు చూస్తుంటే మరోవైపు గ్రామీణాభివృద్ధిశాఖ వద్ద సరిపడా నిధుల్లేక నిశ్చేష్టంగా ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. మిగిలిన నిధులను ఇప్పటికిప్పుడు విడుదల చేసినా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు.
 
 ‘ఉపాధి’కీ దెబ్బ..
 మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వెచ్చించాల్సిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం వాటా 90 శాతంకాగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 10 శాతం నిధులను వెచ్చిస్తోంది. ఈ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు 13 కోట్ల పనిదినాలు కల్పించాల్సి ఉండగా,  ఇప్పటివరకు 9 కోట్ల పనిదినాలను మాత్రమే కల్పించారు. అలాగే ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ (ఐడబ్ల్యూఎంపీ)కు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 90:10 నిష్పత్తిలో నిధులను వెచ్చిస్తాయి. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ. 300 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు విడుదలైంది రూ.144.47 కోట్లే కావడం గమనార్హం.
 
 వీటన్నిటి పరిస్థితీ అంతే..
 కేంద్ర నిధులతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిర జల ప్రభ (ఐజేపీ), నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం), రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా అమలు చేస్తున్న ఆసరా, మహిళా కిసాన్ స్వశక్తి కరణ్ పరియోజన (ఎంకేఎస్‌పీ), ఆమ్ ఆద్మీ బీమా యోజన, వడ్డీలేని రుణాలు తదితర పథకాల బడ్జెట్ కేటాయింపులకు, నిధుల విడుదలకు పొంతనే లేదు.
 
 పని కష్టమే..?
 రాష్ట్రంలో ‘ఉపాధి’ కల్పించాల్సిన పనిదినాలు.. 13 కోట్లు
 కూలీలకు కల్పించిన పనిదినాలు.. 9 కోట్లు
 కేటాయించిన నిధులు.. రూ. 2,122.72 కోట్లు
 ఇప్పటికి విడుదల చేసింది.. రూ.1,051.26 కోట్లు
 
 చెప్పేది ఘనం.. అభివృద్ధి శూన్యం
 కేంద్ర,రాష్ట్రాలు కేటాయించిన నిధులు.. రూ. 5,403 కోట్లు
 విడుదల చేసిన నిధులు.. రూ.3,261 కోట్లు
 ఇంకా ఇవ్వాల్సినవి.. రూ. 2,142 కోట్లు
 వ్యయం కోసం ఉన్న గడువు.. 37 రోజులే
 

మరిన్ని వార్తలు