గొర్రెకుంట: ప్రాణాలతో వుండగానే బావిలో...

24 May, 2020 03:45 IST|Sakshi
మృతదేహాలు తేలిన బావి వద్ద పరిశీలిస్తున్నకేంద్ర అధికారుల బృందం

గొర్రెకుంటలో 9 మంది వలస కార్మికుల మృతిపై కేంద్రం ఆరా

సంఘటనా స్థలాన్ని సందర్శించిన సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీ

పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు

మృతులకు చెందిన రెండు సెల్‌ ఫోన్లు స్వాధీనం..

వాటి కాల్‌ డేటా ఆధారంగా విచారణ 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: తీవ్ర కలకలం రేపిన వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట సంఘటనపై అసలేం జరిగిందనే దానిపై కేంద్ర హోం శాఖ శనివారం ఆరా తీసినట్లు సమాచారం. వ్యవసాయ బావిలో తొమ్మిది మృతదేహాలు తేలిన ఘటన ఇంకా మిస్టరీగానే ఉంది. ఈ మేరకు సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు శనివారం గొర్రెకుంటలోని బావిని పరిశీలించారు. కాగా, తొమ్మిది మృతదేహాలకు శుక్రవారం రాత్రి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వాళ్లంతా ప్రాణాలతో ఉండగానే బావిలో పడినట్లు ప్రాథమిక నివేదికలో తేల్చారు. వాళ్లంతట వాళ్లే కావాలని బావిలోకి దూకారా.. లేదంటే మత్తు, విషం లాంటిది ప్రయోగించి బతికి ఉండగానే బావిలో పడేశారా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. (పోలీసుల అదుపులో యాకూబ్.. సెల్ఫోన్లు ఎక్కడ?)

పోలీసుల అదుపులో ముగ్గురు.. 
ఈ కేసులో మూడు రోజులు గడిచినా పురోగతి లేదు. ఈ నేపథ్యంలో పలు కోణాల్లో విచారణ జరుపుతున్న పోలీసు ప్రత్యేక బృందాలు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒకరు బావిలో శవమై తేలిన బుష్రా ఖాతూన్‌ ప్రియుడు యాకూబ్‌ కాగా, మరో ఇద్దరు బిహార్‌కు చెందిన కార్మికులు. యాకూబ్‌ను శుక్రవారమే అదుపులోకి తీసుకోగా, శనివారం సంజయ్‌ కుమార్‌ యాదవ్, మంకుషాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలకు రెండు సెల్‌ఫోన్లు దొరికినట్లు సమాచారం. ఆ రెండింటిలో ఒకటి మక్సూద్‌ది కాగా, మరొకటి బుష్రా ఖాతూన్‌దిగా చెబుతున్నారు. ఆ రెండు ఫోన్ల కాల్‌డేటా వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది. (చనిపోయారా.. చంపేశారా?)

గొర్రెకుంటలో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ 
ముగ్గురు ఆనుమానితులు అదుపులోకి తీసుకుని రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న సిట్‌ పోలీసులు, శనివారం ఉదయం గొర్రెకుంటలోని బావి వద్ద పలు కోణాల్లో పరిశోధన జరిపారు. సంజయ్‌కుమార్‌ యాదవ్, మంకుషాను సంఘటన వద్దకు తీసుకువచ్చి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ తరహాలో పరిశీలించారు. మొదటి అంతస్తులోని మరణించిన ఇద్దరు బిహారీల గదిని అడిషనల్‌ డీసీపీ (అడ్మిన్‌) వెంకటలక్ష్మి నేతృత్వంలో పోలీసు బృందాలు పరిశీలించాయి. బంగ్లా మీది నుంచి ఎవరైనా బలవంతంగా బావిలో పడేయడం సాధ్యమేనా అన్న కోణంలో విచారణ జరిపారు. సుమారు గంట పాటు గొర్రెకుంటలో పరిశీలన చేశారు. (గీసుకొండ ఘటనపై పలు అనుమానాలు)

పకడ్బందీగా దర్యాప్తు చేయండి: హోంమంత్రి
వరంగల్‌ జిల్లాలోని గొర్రెకుంట ఘటనపై పకడ్బందీగా దర్యాప్తు జరపాలని వరంగల్‌ పొలీసు కమిషనర్‌ వి.రవీందర్‌ను హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ఆదేశించారు.

సెల్‌ఫోన్‌ సంభాషణలే కీలకం
ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్ల వారంతా చనిపోయారని పోస్టుమార్టం నివేదికలో ఎంజీఎం మార్చురీ ఫోరెన్సిక్‌ విభాగం హెడ్‌ డాక్టర్‌ రజామాలిక్‌ పేర్కొన్నారు. బావిలోనే తుది శ్వాస విడిచారని, అయినా వారి విస్రాను సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని, వారిపై ఫుడ్‌ పాయిజన్‌ జరిగిందా.. లేదా అనేది తేలాలంటే ఫోరెన్సిక్‌ నివేదిక రావాలని తెలిపారు. నలుగురు మృతుల ఒంటిపై గాయాలు ఉన్నాయని నివేదికలో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో పోలీసుల పరిశోధనకు సెల్‌ఫోన్‌ సంభాషణలు, కాల్‌డేటా కీలకంగా మారాయి. బుష్రా ఖాతూన్, ఆమెతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న యాకూబ్‌ ఫోన్‌ కాల్స్‌తో పాటు ఇతరులతో మక్సూద్‌ ఏం మాట్లాడాడనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. మృతుల్లో ఏడుగురి సెల్‌ ఫోన్లు కనిపించకపోవడంతో వాటి కోసం గాలిస్తున్నారు.

మార్చురీలోనే మృతదేహాలు 
తొమ్మిది మృతదేహాలు కూడా శనివారం రాత్రి వరకు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలోనే ఉన్నాయి. శుక్రవారం రాత్రి పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాలను ఫ్రీజర్లలో భద్రపరిచారు. శనివారం ఉదయం మృతదేహాలను ఖననం చేస్తారని భావించారు. కానీ మక్సూద్‌ బంధుమిత్రులు పశ్చిమ బెంగాల్‌ నుంచి వస్తున్నారనే సమాచారంతో మార్చురీలో భద్రపరిచినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, కేసు ఓ కొలిక్కి వచ్చేవరకు మృతదేహాలను భద్రపరచనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు