అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తున్నారు

12 Apr, 2018 02:21 IST|Sakshi

ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

హైదరాబాద్‌ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేవిధంగా కేంద్రం, న్యాయస్థానం వ్యవహరిస్తున్నాయని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ దళితులు, గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సుప్రీంకోర్టు తీర్పు ఉండటం బాధాకరమన్నారు. దేశంలో 25 శాతమున్న దళితులు తలెత్తుకోకుండా చెయ్యడంలో భాగంగానే కేంద్రం, సుప్రీంకోర్టు నిర్ణయాలున్నాయని అన్నారు. నమోదవుతున్న కేసుల్లో 90% వీగిపోతున్నాయని, అలాంటప్పుడు చట్టాలు రద్దు చెయ్యడమే పరిష్కారమా అని ప్రశ్నించారు. 302, 307 కేసులు వీగిపోతున్నాయని, వరకట్న వేధింపుల కేసుల్లో 97%, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 75% వీగిపోతున్నాయని, కేవలం అట్రాసిటీ చట్టంపైనే చర్యలు తీసుకోవడమెందుకని ప్రశ్నించారు.

న్యాయవ్యవస్థలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అన్ని రంగాల్లో దళిత, గిరిజనులకు రిజర్వేషన్లు సాధించే దిశగా దక్షిణాది రాష్ట్రాలను కలుపుకుని మే 20న వరంగల్, హైదరాబాద్, అమరావతిలలో ఏదో ఒకచోట సింహగర్జన సభ నిర్వహిస్తామని చెప్పారు. శుక్రవారం దళిత సంఘాల నేతలతో సమావేశమై ఉద్యమ కార్యాచరణపై సమాలోచనలు చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు