పరిధుల ప్రభావం ప్రజలపై వద్దు!

12 Apr, 2018 02:19 IST|Sakshi
డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి

మూడు కమిషనరేట్లలో ఏకరూప పోలీసింగ్‌

ఏ ఠాణాలో చూసినా ఒకే తరహా స్పందన ఉండాలి  

పోలీసు అధికారుల ఒక రోజు సదస్సులో డీజీపీ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ‘రాజధానిలో ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లు సాంకేతికంగా వేరైనప్పటికీ ప్రజల దృష్టిలో మాత్రం ఒకటే. ఈ మూడింటిలో ఏకరూప పోలీసింగ్‌ ఉండాలి’అని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు చరిత్రలో తొలిసారిగా డీజీపీ మూడు కమిషనరేట్ల అధికారులతో భేటీ అయ్యారు. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో బుధవారం ‘యూనిఫాం సర్వీస్‌ డెలివరీ.. వన్‌ సిటీ–వన్‌ సర్వీస్‌–వన్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఫర్‌ ది సిటిజన్‌’పేరుతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి అధికారులు, సిబ్బందికి కొన్ని కీలక సూచనలు చేయడంతో పాటు అనేక ఆదేశాలు ఇచ్చారు. 

ప్రజలు ప్రశాంత జీవనంతో పాటు నేరరహిత సమాజాన్ని, పోలీసుల నుంచి జవాబుదారీతనంతో కూడిన మెరుగైన సేవల్ని కోరుకుంటారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా విధులు నిర్వర్తించేలా ప్రతి పోలీసునూ మార్చాల్సిన బాధ్యత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లుగా వ్యవహరించే ఇన్‌స్పెక్టర్లదని డీజీపీ స్పష్టం చేశారు. మూడు కమిషనరేట్లలోని ఏ ఠాణాకు వెళ్లినా ప్రజలకు ఒకే రకమైన స్పందన కనిపించాలని, బాధితుల సామాజిక–ఆర్థిక–వ్యక్తిగత హోదాల ఆధారంగా ఈ స్పందన మారకూడదని సూచించారు. సహయం కోరుతూ వచ్చిన బాధితులు/ప్రజలతో పోలీసుల వ్యవహారశైలి సక్రమంగా లేకుంటే ఆ ప్రభావం పోలీసు విభాగం మొత్తమ్మీద ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

హైదరాబాద్‌ కమిషనరేట్‌లో మాదిరిగా మిగిలిన రెండింటిలోనూ టెక్నాలజీ వినియోగం పెరగాలని, ఫలితంగా నేరాల నిరోధం, కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర రహిత సమాజం ఆవిష్కరించే ప్రయత్నాల్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని డీజీపీ పేర్కొన్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ప్రారంభించిన నేను సైతం, కమ్యూనిటీ సీసీ కెమెరాలు వంటి ప్రాజెక్టులు, కమ్యూనిటీ పోలీసింగ్‌ విధానాలు మిగిలిన చోట్లా అమలు కావాలని ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్న పోలీసు అధికారుల్ని డీజీపీ అభినందించారు. 

ప్రభుత్వం పోలీసు విభాగానికి అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తోందని, ప్రజలకు మేలైన సేవలు అందిస్తేనే సార్థకత ఉంటుందని సూచించారు. తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న అనేక చర్యలపై రూపొందించిన డాక్యుమెంటరీతో పాటు ప్రజల మన్నన పొందడానికి తీసుకోవాల్సిన అంశాలపై ముద్రించిన ప్రతిని డీజీపీ ఆవిష్కరించారు. సదస్సులో అదనపు డీజీ జితేందర్, హైదరాబాద్‌ ఇన్‌చార్జ్‌ సీపీ డీఎస్‌ చౌహాన్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు వీసీ సజ్జనార్, మహేష్‌ ఎం.భగవత్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు