కోటిన్నర మందికి పాఠాలు

10 Apr, 2020 04:46 IST|Sakshi

‘ఈ లెర్నింగ్‌’ప్లాట్‌ఫారమ్‌ ద్వారా..  

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఓ వైపు కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండగా, రోగ లక్షణాలు మొదలుకుని చికిత్స దాకా క్షేత్రస్థాయిలో అవగాహన అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా రెండో దశ కొనసాగుతుండగా, మూడో దశకు చేరుకుంటే తలెత్తే పరిస్థితులపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు కరోనా విస్తరిస్తే కట్టడి చేయడం సాధ్యం కాకపోవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు కేంద్ర పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగం (డీఓపీటీ) ‘ఈ ప్లాట్‌పారమ్‌’ను రూపొందించింది.

క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఎన్‌సీసీ, నెహ్రూ యువకేంద్రం, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్, రెడ్‌క్రాస్‌ సంస్థలకు చెందిన కార్యకర్తలకు ‘ఆన్‌లైన్‌ లెర్నింగ్‌’ విధానంలో పాఠాలు బోధించాలని డీఓపీటీ నిర్ణయించింది. వీరికి ముందస్తు అవగాహన, శిక్షణ ద్వారా అత్యయిక స్థితిని ఎదుర్కోవచ్చని డీఓపీటీ భావిస్తోంది. డీఓపీటీకి చెందిన ‘ఐ గాట్‌’ వెబ్‌సైట్‌లో అంతర్భాగంగా పనిచేసే ‘ఈ ప్లాట్‌ఫారం’ద్వారా దేశవ్యాప్తంగా కోటిన్నర మందికి శిక్షణ ఇస్తారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎవరెవరు ఏయే విధులు నిర్వర్తించాలి అనే అంశంపై సలహాలు, సూచనలకు సంబంధించిన మాడ్యూల్స్‌ అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో సుమారు లక్ష మందికి ఈ తరహా అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వార్తలు