స్వస్థలానికి బాలకార్మికులు.. 

22 Jul, 2019 10:52 IST|Sakshi
స్వస్థలాలకు వెళ్తున్న చిన్నారులకు వీడ్కోలు పలుకుతున్న అధికారులు, న్యాయమూర్తి వినోద్‌ కుమార్‌

సురక్షితంగా తీసుకెళ్లేందుకు ఎస్కార్ట్‌ ఏర్పాటు చేసిన అధికారులు  

రైలెక్కించి చిన్నారులకు వీడ్కోలు పలికిన న్యాయమూర్తి వినోద్‌ కుమార్‌ 

సాక్షి, ఖమ్మం: జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్, చైల్డ్‌లైన్‌ శాఖలు గుర్తించిన బాలకార్మికులు వారి స్వస్థలానికి బయలుదేరారు. చిన్నారులను తీసుకుని ఆదివారం అధికారులు అండమాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఖమ్మం రైల్వే స్టేషన్‌ నుంచి భోపాల్‌కు బయలుదేరారు. అక్కడి నుంచి వారి స్వస్థలం బాలాఘాట్‌కు తీసుకెళ్లనున్నారు. ఈ నెల 17న 29 మంది బాలకార్మికులను నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తుండగా జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్, చైల్డ్‌లైన్‌వారు గుర్తించి, బాలకార్మికులను చైల్డ్‌లైన్‌ సంరక్షణలో ఉంచిన విషయం విదితమే.

ఈ సందర్భగా చైల్డ్‌లైన్‌ కో ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ న్యాయమూర్తి వినోద్‌కుమార్, ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్, సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్, ఆర్‌పీఎఫ్‌ సీఐ మధుసూదన్‌లు చొరవ తీసుకుని బాలలను సురక్షితంగా భోపాల్‌ పంపించేందుకు పలువురి సిబ్బందిని ఎస్కార్ట్‌గా ఏర్పాటు చేశారని వివరించారు. వీరిలో ఏఆర్‌ పోలీస్‌లు 13 మంది, ఆర్‌పీఎఫ్‌ నుంచి ఒకరు, జీఆర్‌పీ నుంచి ఇద్దరు, చైల్డ్‌లైన్‌ నుంచి ఒకరు, ఐసీడీఎస్‌ నుంచి ఒకరు ఎస్కార్ట్‌గా వెళ్లినట్లు పేర్కొన్నారు. న్యాయసేవా సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి వినోద్‌కుమార్‌ దగ్గరుండి రైలు ఎక్కించి పిల్లలకు వీడ్కోలు పలికారు. బాలల రక్షణ అధికారి విష్ణునందన, చైల్డ్‌లైన్‌ బాధ్యులు శ్రీనివాస్, కోర్టులైజన్‌ ఆఫీసర్‌ భాస్కర్‌రావు, సీడీపీఓ బాలత్రిపురసుందరి, భారతి, హరిప్రసాద్, సోని, జీఆర్‌పీ సిబ్బంది బాలబాలికలకు అన్ని సదుపాయాలు ఏర్పాటుచేసి భోపాల్‌ పంపించారు.    

మరిన్ని వార్తలు