రంగంలోకి సీబీసీఐడీ

12 Aug, 2014 02:16 IST|Sakshi

ఖానాపూర్ : ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై నిగ్గు తేల్చడానికి సీబీసీఐడీ రంగంలోకి దిగింది. జిల్లాలో అత్యధికంగా ఖానాపూర్, ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్, రెబ్బెన ప్రాంతాల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న నేపథ్యంలో ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఆయా మండలాల్లో దర్యాప్తుకు శ్రీకారం చుట్టారు. సోమవారం సీబీసీఐడీ డీఎస్పీ రవికుమార్, ఇన్‌స్పెక్టర్లు వి.చేరాల, బి.రఘుపతి హౌసింగ్ డీఈ కార్యాలయంలో ఈఈ అలీంబిన్‌మాలియా నుంచి ఇళ్ల వివరాలు, చెల్లింపులు, ఇతరత్రా సమాచారం సేకరించారు.

 కంప్యూటర్ నుంచి వివరాలు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇప్పటికే 2009లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై థర్డ్ పార్టీ సర్వే కమిటీ వివరాలు, తదితర అంశాలను సేకరిస్తున్నారు. రూ.కోటీ 29లక్షలకు పైగా అక్రమాలు జరిగాయన్న థర్డ్ పార్టీ విచారణ నివేదిక ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విషయమై ఈఈ ఆదేశాల మేరకు వర్క్‌ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది నాలుగు రోజులుగా ఇళ్ల నిర్మాణాల రికార్డులు తయారు చేశారు. ఇంటింటికీ తిరుగుతూ లబ్ధిదారుల నుంచి వీడియో స్టేట్‌మెంటు రికార్డు చేసి విచారణ జరిపిన ఇళ్లకు నంబర్లు వేస్తున్నారు.

 తహశీల్దార్, ఎంపీడీవో, తదితర శాఖల అధికారుల నుంచి ఇళ్ల నిర్మాణాలపై సీబీసీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. తాజాగా సీబీసీఐడీ అధికారులు రంగంలోకి దిగడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. సీబీసీఐడీ అధికారుల వెంట ఆ శాఖ సిబ్బంది షంషీర్‌ఖాన్, రమణ, పట్టాభి, తిరుపతి, సుధాకర్, ఆన్‌చార్జి ఎస్సై టీవీరావు, వర్క్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ తదతరులు ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు