మధ్యప్రదేశ్‌ సీఎం నివాసాన్ని చూసే కట్టించా

4 Jan, 2017 02:27 IST|Sakshi
మధ్యప్రదేశ్‌ సీఎం నివాసాన్ని చూసే కట్టించా

ప్రగతి భవన్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల సీఎం కేసీఆర్‌ గృహప్రవేశం చేసిన కొత్త క్యాంపు కార్యాలయం తరచూ వార్తల్లో అంశంగా మారుతోంది. అనవసరంగా నిర్మించారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తుండటం, నేరుగా అసెంబ్లీలోనే ప్రస్తావనకు తేవడంతో ముఖ్యమంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా మంగళవారం మరో సందర్భంలో స్వయంగా ముఖ్యమంత్రే దాన్ని ప్రస్తావించారు. మత్స్యశాఖపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన దీని గురించి మాట్లాడారు. ‘‘నేను మధ్యప్రదేశ్‌ సీఎం చౌహాన్‌ అధికార నివాసాన్ని చూసిన తర్వాత అలాంటి భవనం తెలంగాణ ముఖ్యమంత్రికి ఉండాలని భావించి ప్రగతి భవన్‌ నిర్మించా.

మధ్యప్రదేశ్‌ సీఎం నివాసంలో దాదాపు 2 వేల మంది సామర్థ్యంతో భారీ సమావేశ మందిరం ఉంది. అది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎక్కువ మంది పాల్గొనాల్సిన సమావేశాలకు అలాంటి హాలు అవసరం. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాసంలో జనహిత పేరుతో అలాంటి హాల్‌నే నిర్మించా. దాదాపు 1,500 మంది ఇందులో కూర్చోవచ్చు. ఇప్పుడు ఆ హాలులో మత్య్యకార వృత్తిలో ఉండే వారితో సమావేశమవుతా. వీలైతే సంక్రాంతి సమయంలోనే సమావేశం ఏర్పాటు చేస్తా’’అని వివరించారు. మంత్రి తలసాని సూచనతో మంగళవారం ముఖ్యమంత్రి శాసనసభ వేదిక ద్వారా ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా చేపట్టబోయే వంతెనలను చెక్‌డ్యాం నమూనాలో నిర్మించాలని సూచించానని, అవి కూడా నీటిని నిల్వ చేస్తే వాటిల్లో కూడా చేపలు పెంచే వెసులుబాటు ఉంటుందని సీఎం అన్నారు.

మరిన్ని వార్తలు