18 దాకా అసెంబ్లీ సమావేశాలు!

4 Jan, 2017 04:45 IST|Sakshi
18 దాకా అసెంబ్లీ సమావేశాలు!

11న బీఏసీ భేటీలో అధికారిక ప్రకటన?
సాక్షి, హైదరాబాద్‌: శాసన సభ, శాసన మండలి సమావేశాలను మరికొద్ది రోజులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. గతనెల 16న మొదలైన ఉభయ సభల సమావేశాలు ఈ నెల 11వ తేదీ దాకా జరగనున్నాయి. మరోసారి సమావేశాలను పొడిగించేందుకు 11వ తేదీన బీఏసీ సమావేశం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. అధికార పార్టీ సభ్యుల నుంచి తెలిసిన సమాచారం మేరకు ఈ నెల 18వ తేదీ వరకు సమావేశాలను పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు 11న జరగనున్న బీఏసీ భేటీలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దీనిపై అనధికారికంగా చెప్పారని సమాచారం. ఈ నెల 12న కూడా సభ జరిపి, 13, 14, 15 తేదీల్లో సంక్రాంతి సెలవులు తీసుకుని తిరిగి 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సభ నిర్వహించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే శీతాకాల సమావేశాలను మొత్తంగా 23 రోజుల పాటు జరిపినట్లు అవుతుంది.

పొడిగింపు వెనుక వ్యూహం!: రాష్ట్రంలో చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల అమలుపై సమగ్ర చర్చ జరగాలని, వాస్తవాలు ప్రజలకు వివరించాలని అధికార పక్షం భావిస్తోంది. ఈ కారణంగానే దాదాపు అన్ని ప్రభుత్వ పథకాలపై లఘు చర్చలను చేపడుతోందని అంటున్నారు. ఓ వైపు విపక్షాలు కోరిన అంశాలపై చర్చ జరుపుతూనే అధికార పక్షంగా తమ పాలన తీరును అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి తీసుకువెళ్లే వ్యూహాన్ని అధికారపక్షం అనుసరిస్తోందని చెబుతున్నారు. సమావేశాలు మొదలు కావడానికి ముందు, ఆ తర్వాత జరిగిన టీఆర్‌ఎస్‌ శాసన సభాపక్ష సమావేశంలో ఇదే అంశంపై చర్చ జరిగింది. ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసుకుందామన్న వ్యూహంతోనే సమావేశాల తేదీలను పొడిగిస్తున్నారని విపక్ష సభ్యులు అభిప్రాయపడుతున్నారు. సమావేశాల తేదీల పొడిగింపుపై ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకంగా మాట్లాడితే.. రాష్ట్రాభివృద్ధిపై వారికి చిత్తశుద్ధి లేదని, అందుకే సమావేశాలు వద్దంటున్నారని ఎదురుదాడి చేసే ప్లాన్‌లో కూడా అధికార పార్టీ ఉందని విశ్లేషిస్తున్నారు.

మరిన్ని వార్తలు