లక్కు..కిక్కు

19 Oct, 2019 02:41 IST|Sakshi

మద్యం షాపుల కేటాయింపు పూర్తి

సాక్షి, హైదరాబాద్‌: లక్కు కిక్కు కొందరిదైతే..అదృష్టం చిక్కలేదనే నిరాశ మరికొందరిది. లాటరీలో చేజారిన షాపును ఎలాగైనా వశం చేసుకోవాలనే ఆరాటం ఇంకొందరిది. దుకాణం దక్కించుకున్న అదృష్టజాతకుడితో బేరసారాలు, బుజ్జగింపుల ఉత్కంఠ మధ్య శుక్రవారం మద్యం దుకాణాల కేటాయింపుల పర్వం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం షాపులకు నిర్వహించిన లక్కీ డ్రాలో 34 దుకాణాలు మినహా మిగతావాటిని ఖరారు చేసినట్లు అబ్కారీవర్గాలు తెలిపాయి. కోర్టు కేసులు, ఐదుకంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన షాపుల డ్రాను నిలిపివేశారు.

సిండికేట్‌గా మారడంతోనే దరఖాస్తులు తక్కువగా నమోదైనట్లు భావించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ షాపులపై 48 గంటల్లో విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఈ విచారణ నివేదిక అనంతరం ఈ దుకాణాల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాగా, ఎంపికైన మద్యం దుకాణాలు 2019–21 వరకు కొనసాగనున్నాయి. నవంబరు ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీకి అమలులోకి రానుంది. ఈనెల 9 నుంచి 16 వరకు మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరించగా.. రాష్ట్రవ్యాప్తంగా 48,243 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ఫీజు రూపంలోనే రాష్ట్ర ఖజానాకు రూ.964 కోట్ల మేర ఆదాయం లభించింది.

>
మరిన్ని వార్తలు