కూటమి పీటముడి

13 Oct, 2018 12:07 IST|Sakshi

ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ దాదాపు మూడు స్థానాలకు అనధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన మరో ఆరు స్థానాల్లో మహా 
కూటమిలో భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, టీజేఎస్‌లకు స్థానాల కేటాయింపుపై ఉత్కంఠ నెలకొంది. సీట్ల సర్దుబాటు ఎటూ తేలకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంలో ముందడుగు వేయలేకపోతున్నారు. 

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: మహాకూటమి సీట్ల సర్దుబాటుపై పీటముడి వీడటం లేదు.  కూటమిలో భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, టీజేఎస్‌లకు ఉమ్మడి జిల్లాలో ఏ స్థానమైనా కేటాయిస్తారా.. లేదా అనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో ఆయా పార్టీల నుం చి పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహుల్లో అయోమయం.., వారి అనుచరవర్గాల్లో గందరగోళం నెలకొంది. టీఆర్‌ఎస్‌ ఇప్పటికే తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల ను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే కూటమి సీట్ల సర్దుబాటుపై ఎటూ తేలకపోవడంతో తొమ్మిది స్థానాల్లో ఆరుచోట్ల అయోమయం నెలకొంది. కాంగ్రెస్‌ దాదాపు మూడు స్థానాలకు అనధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది.

కామారెడ్డిలో మండలిలో కాం గ్రెస్‌ పక్షనేత షబ్బీర్‌ అలీ, బోధన్‌లో మాజీ మంత్రి పి సుదర్శన్‌రెడ్డిలకు టిక్కె ట్‌ దాదాపు ఖాయమైంది. ఆర్మూర్‌లో ఎమ్మెల్సీ ఆకుల లలితకు కూడా అభ్యర్థిత్వం ఖరారు కానుంది. ఈ మూడు చోట్ల ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. కామారెడ్డి, బోధన్‌లలో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి రోడ్‌షోలు, బహి రంగసభలు నిర్వహించారు. ఆర్మూర్‌లో కూడా ఆకుల లలిత గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా మిగిలిన ఆరు స్థానాల్లో కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, టీజేఎస్‌లకు సీట్ల కేటాయింపు ఎటూ తేలకపోవడంతో ఆయా నియోజకవర్గాల్లో ఆయా పార్టీల శ్రేణులు గందరగోళంలో ఉన్నాయి.

బాల్కొండ బరిలో నిలిచేదెవరూ..? 
కూటమి పార్టీల్లో ఒకటైన టీడీపీ జిల్లాలో నిజామాబాద్‌ రూరల్, బాన్సువాడ, బాల్కొండ నియోజకవర్గాలపై గురిపెట్టింది. మూడింట్లో ఏదైనా ఒకటి అడగాలని పక్షం రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన టీడీపీ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. బాల్కొండలో టీడీ పీ నేత ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి పోటీ చేయాలని ని ర్ణయించుకున్నారు. సైకిల్‌ గుర్తుపై కాకుండా కాం గ్రెస్‌ గుర్తుపైనే పోటీ చేస్తే ఓట్లు పడతాయని భావిస్తున్నారు. ఇదే స్థానంపై టీజేఎస్‌ కూడా గురిపెట్టినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేత ము త్యాల సునిల్‌రెడ్డి టీజేఎస్‌ నుంచి బరిలోకి దిగే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్‌ లో కూడా మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌ టిక్కెట్‌ తనకేనంటూ ధీమాతో ఉన్నారు. మొత్తం కూటమిలో సీట్ల సర్దుబాటు తేలకపోవడంతో బాల్కొండలో ఆయా పార్టీల శ్రేణులు, నేతల అనుచరులు అయోమయంలో ఉన్నారు.

‘రూరల్‌’లోనూ అదే పరిస్థితి.. 
నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో టీడీపీ తన ఉనికిని చాటుకునేందుకు పావులు కదపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు తన పాత అనుచరులకు ఫోన్లు చేసి పిలిపించుకుని సమాలోచనలు జరిపారు. దీంతో ఈ స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకుని కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి వర్గం ఒకింత ఆందోళనకు గురైంది. కూటమిలో ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేసినా పూర్తి మద్దతును తెలపాలని మండవ అనుచరులకు సూచించారు.
 
ప్రచారం చేసుకోలేకపోతున్నారు.. 
సీట్ల సర్దుబాటు ఎటూ తేలకపోవడంతో ఆయా స్థానాల నుంచి పోటీ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్న అభ్యర్థులు ప్రచారంలో ముందడుగు వేయలేకపోతున్నారు. ప్రచారంతో పాటు పోల్‌ మేనేజ్‌మెంట్‌పైనా దృష్టి సారించలేకపోతున్నారు. టీఆర్‌ఎస్‌ మాత్రం ప్రచారంలో ముందంజలో ఉంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులు గ్రామగ్రామాన తిరుగుతున్నారు. కూటమి సీట్ల సర్దుబాటు తేలే వరకూ ప్రతిపక్ష పార్టీల ప్రచారం జోరందుకునే అవకాశంలేదు.

మరిన్ని వార్తలు