అప్పుడు లేని మాంద్యం ఇప్పుడెలా?

16 Sep, 2019 02:18 IST|Sakshi
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు

సాక్షి, హైదరాబాద్‌: ఆరు నెలల కింద ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమయంలో లేని మాంద్యం ఇప్పుడెలా వచ్చిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సైతం బడ్జెట్‌లో ఎక్కడా మాంద్యం గురించి ప్రస్తావించలేదని తెలిపారు. కానీ ప్రస్తుత పూర్తిస్థాయి బడ్జెట్‌లో మాత్రం 15 నెలల నుంచి మాంద్యం ఉందని చెప్పి బడ్జెట్‌కు కోత పెట్టారని విమర్శించారు. ఆదివారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడారు. వాహనాలు, ట్రాక్టర్ల కొనుగోళ్లు 30 శాతం తగ్గాయని చెబుతున్నారని, కానీ మాంద్యానికి ఇది ప్రామాణికం కాదని తెలిపారు. రెవెన్యూ మిగులు ఉన్న సమయంలో రాష్ట్ర బడ్జెట్‌ ఎలా తగ్గిందో చెప్పాలన్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది బడ్జెట్‌లో కీలకమైన విద్యా శాఖకు 24 శాతం, వైద్యానికి 25 శాతం, గ్రామీణాభివృద్ధికి 32 శాతం తక్కువగా కేటాయింపులు చేశారని పేర్కొన్నారు.   

కాళేశ్వరం చూసే చేరాం: ఎమ్మెల్యే గండ్ర
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రైతుల సంక్షే మం కోసం ప్రభుత్వం అనేక పథకాలు తెచ్చిందని, రైతు బంధుతో రైతుల్లో ధీమా పెంచారని తెలిపా రు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు ఎనలేని ప్రయోజనం కలుగుతోందని, దాన్ని చూసే 12 మంది కాంగ్రెస్‌ సభ్యులం టీఆర్‌ఎస్‌లో చేరామన్నారు.

మరిన్ని వార్తలు