పొత్తుపై కాంగ్రెస్-టీఆర్‌ఎస్ రహస్య చర్చలు

12 Mar, 2014 03:50 IST|Sakshi

కేసీఆర్‌తో దిగ్విజయ్, అహ్మద్‌పటేల్ మంతనాలు
 సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ - టీఆర్‌ఎస్‌ల మధ్య పొత్తు చర్చలు రహస్యంగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్, ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్‌లు ఒకవైపు టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుతో ఫోన్ ద్వారా మంతనాలు సాగిస్తుండగా.. రాష్ట్ర స్థాయిలో టీఆర్‌ఎస్ తరఫున కె.కేశవరావు, కాంగ్రెస్ తరఫున జానారెడ్డి పొత్తుపై చర్చలు కొనసాగిస్తున్నారు. హైకమాండ్ సూచనల మేరకు మంగళవారం ఒక రహస్య ప్రదేశంలో ఇరువురు నేతలు సమావేశమై తెలంగాణలోని పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ బలాబలాలు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంశంపై చర్చలు కొనసాగిస్తున్నారు. పొత్తు అంశం తుది దశకు వచ్చే వరకు వివరాలను వెల్లడించకూడదనే ఉద్దేశంతో ఉన్న ఇరువురు నేతలు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడినట్లు తెలిసింది.
 
 మెజారిటీ సీట్లు కోరుతున్న టీఆర్‌ఎస్?
 అయితే కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు.. టీఆర్‌ఎస్ తమకు 70 అసెంబ్లీ స్థానాలు, 9 లోక్‌సభ స్థానాలను కేటాయించాలని కాంగ్రెస్ ఎదుట ప్రతిపాదిస్తోంది. కాంగ్రెస్ పెద్దలు మాత్రం 40 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్‌సభ స్థానాలను కేటాయిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. సీట్ల కేటాయింపు పై  ఏకాభిప్రాయం కుదరటం లేదని సమాచారం. తెలంగాణలో టీఆర్‌ఎస్ సంస్థాగతంగా చాలా బలహీనంగా ఉందని, చాలా నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణమే లేదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. 

అలాంటి పార్టీ  మెజారిటీ సీట్లు కావాలని అడగటం సరికాదని కాంగ్రెస్ వాదిస్తోంది. 2004లో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా టీఆర్‌ఎస్ 56 సీట్లు కావాలని ఒత్తిడితేగా.. చివరకు 42 సీట్లు కేటాయించామని.. అంతటితో ఆగకుండా వామపక్షాలకు కేటాయించిన 10 స్థానాలపైనా పోటీకి దిగిందని గుర్తు చేశారు. ఇంత చేసినప్పటికీ తీరా ఎన్నికల్లో ఆ పార్టీ సగం సీట్లలో ఓడిపోయి, 26 సీట్లకే పరిమితమైందని గుర్తుచేస్తున్నారు. 2009 ఎన్నికల్లో మహాకూటమితో పొత్తులో భాగంగా టీడీపీపై ఒత్తిడి తెచ్చి 52 స్థానాల్లో టీఆర్‌ఎస్ పోటీ చేయగా.. 10 స్థానాలకే పరిమితమైందన్న లెక్కలను ముందుపెడుతున్నారు. దిగ్విజయ్‌సింగ్ రెండు, మూడు రోజుల్లో టీఆర్‌ఎస్ నేతలతో పొత్తుపై చర్చలు జరిపే అవకాశముందని పేర్కొన్నారు. ఈ నెల 13న సాయంత్రం దిగ్విజయ్‌సింగ్ రాష్ట్రానికి వస్తున్నారని, ఆ మరుసటి రోజు కేసీఆర్ లేదా కేశవరావులతో పొత్తుపై చర్చలు జరిపే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు.
 
 13న హైదరాబాద్‌కు దిగ్విజయ్
 సాక్షి, న్యూఢిల్లీ:  లోక్‌సభ, శాసనసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక సహా పార్టీకి సంబంధించి పలు అంశాలపై చర్చించేందుకు తాను హైదరాబాద్‌కి వెళ్లనున్నట్టు దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. ఈనెల 13, 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లో ఉండనున్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు