అక్కడ ఉత్పత్తి.. ఇక్కడ ఉత్తుత్తి

25 Feb, 2018 02:41 IST|Sakshi

కర్ణాటక రైల్వే యూనిట్‌ కళకళ   

దానికన్నా ముందే మంజూరైన మన ప్రాజెక్టు వెలవెల

రాష్ట్ర ప్రభుత్వం–రైల్వే మధ్య సమన్వయ లోపం 

కాజీపేట ఓవర్‌ హాలింగ్‌ యూనిట్‌ తరలిపోయే ప్రమాదం  

ఇది రైలు బోగీల ఫ్రేమ్స్‌ తయారు చేసే ఫియెట్‌ కార్ఖానా.కర్ణాటకలోని యద్గీర్‌లో నిర్మితమైంది. 2014లో దీనికి శంకుస్థాపన జరగ్గా గతేడాది ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రత్యక్షంగా 500 మందికి పరోక్షంగా 2 వేల మందికిపైగా ఉపాధి కల్పిస్తోంది. రూ.90 కోట్ల వ్యయంతో 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో దీన్ని రెండు రెట్ల సామర్థ్యానికి విస్తరించే యోచన ఉంది. 

సాక్షి, హైదరాబాద్‌: ఈ రెండు ఉదంతాలకు దక్షిణ మధ్య రైల్వేనే వేదికైంది. మరి అక్కడ అలా ఇక్కడ ఇలా ఎందుకున్నట్టు... రాష్ట్ర ప్రభుత్వం–రైల్వే శాఖ మధ్య సమన్వయ లోపం ప్రాజెక్టులకు శాపంగా మారింది. రైల్వే ప్రాజెక్టులు, లైన్ల విషయంలో తెలంగాణ వెనుకబడినందున రైల్వే శాఖపై ఒత్తిడి తెచ్చి కొత్త వాటిని సాధించుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కాజీపేటకు దశాబ్దం క్రితం మంజూరైన ప్రాజెక్టు జాప్యానికి.. అందుకు కేటాయించిన భూమిపై వివాదాలు ఏర్పడటమే కారణం.

దేవాదాయ శాఖకు చెందిన భూమిని నేరుగా రైల్వేకు కేటాయించే వెసులుబాటు లేకపోవటంతో న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. ఇప్పటికీ ఆ చిక్కులు వీడలేదు. ఇంకా జాప్యం చేస్తే ఆ వర్క్‌షాప్‌ కూడా చేజారిపోయే ప్రమాదం ఉన్నట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికైనా భూమిని తమకు స్వాధీనపరుస్తారనే నమ్మకంతో రైల్వే శాఖ ఇటీవలి బడ్జెట్‌లో దానికి రూ.250 కోట్లు కేటాయించింది. స్థలం స్వాధీనమైన 18 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించేలా వర్క్‌షాప్‌ సిద్ధం చేస్తామని స్వయంగా దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌ కుమార్‌ యాదవ్‌ చెబుతున్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. కాజీపేట కీలక రైల్వే జంక్షన్‌ అయినందున భవిష్యత్తులో అది పెద్ద యూనిట్‌గా మారే వీలుంది.

శాటిలైట్‌ టెర్మినళ్లు అంతే..: సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల విస్తరణకు అవకాశం లేకపోవటంతో ఇప్పుడు రైళ్లు ప్లాట్‌ఫామ్‌ దొరక్క శివారు ప్రాంతాల్లో అరగంట నుంచి గంటపాటు నిలబడాల్సి వస్తోంది. దీంతో చర్లపల్లి, వట్టి నాగులపల్లిల్లో శాటిలైట్‌ టెర్మినల్స్‌ నిర్మించాలని గతంలో రైల్వే శాఖ ప్రతిపాదించింది. ఇందుకు చర్లపల్లిలో 150 ఎకరాలు, నాగులపల్లిలో 300 ఎకరాలు కావాలని కోరింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోవటంతో చర్లపల్లిలో అందుబాటులో ఉన్న 50 ఎకరాల్లో 3 అదనపు ప్లాట్‌ఫామ్స్, 3 పిట్‌లైన్స్‌తో టెర్మి నల్‌ నిర్మించేందుకు రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. నాగులపల్లిలో 300 ఎకరాలు ఇవ్వలేమని, 150 ఎకరాల వరకు ప్రయత్నిస్తామని ఇటీవల ప్రభుత్వం చెప్పటంతో రైల్వే శాఖ కంగుతింది.

శంషాబాద్‌ విమానాశ్రయాన్ని ఎంఎంటీఎస్‌తో అనుసం ధానించాలని రైల్వే నిర్ణయించింది. కానీ దీనికి విమానాశ్రయ నిర్వహణ చూసే జీఎంఆర్‌ సుముఖంగా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థను ఒప్పించాలని ప్రభుత్వాన్ని రైల్వే కోరింది. కానీ ఇప్పటి వరకు ఆ ప్రయత్నమే కనిపించటం లేదు. ఈలోపు విమానాశ్రయానికి మెట్రో రైల్‌ అనుసంధానంపై వార్తలు వస్తుండటంతో ఎంఎంటీఎస్‌ అనుసంధానం జరగదని రైల్వేశాఖ నిర్ణయానికి వచ్చేసింది.

ఇది కాజీపేటలో వ్యాగన్‌ ఓవర్‌ హాలింగ్‌ వర్క్‌షాపు నిర్మించబోయే స్థలం. ఈ ప్రాజెక్టు మంజూరై పదేళ్లు కావస్తోంది. 160 ఎకరాల్లో దీన్ని నిర్మించాల్సి ఉంది. రైల్వే శాఖ బడ్జెట్‌లో దీనికి నిధులు కేటాయించటం, అవి మురిగిపోయి వెనక్కు వెళ్లిపోవడం ఆనవాయితీగా మారింది. తొలుత వ్యాగన్‌ ఫ్యాక్టరీ, ఆ తర్వాత వ్యాగన్‌ వర్క్‌షాప్, ఆ తర్వాత వ్యాగన్‌ పీరియాడికల్‌ ఓవర్‌ హాలింగ్‌ యూనిట్‌.. ఇలా మారుతూ వచ్చింది. కానీ కనీసం భూమి పూజ కూడా కాలేదు. 

>
మరిన్ని వార్తలు