సగానికి తగ్గనున్న స్కూల్‌ సిలబస్‌

25 Feb, 2018 02:36 IST|Sakshi

ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ తగ్గిస్తున్నామన్నహెచ్చార్డీ మంత్రి

2019 విద్యా సంవత్సరం నుంచి అమలు

డిటెన్షన్‌ విధానాన్నీ ప్రవేశపెడతామన్న జవదేకర్‌

న్యూఢిల్లీ:  పాఠశాల విద్యార్థులపై సిలబస్‌ భారాన్ని తగ్గించే దిశగా కేంద్రం చర్యలు ప్రారంభించింది.  ప్రస్తుతమున్న ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను 2019 విద్యాసంవత్సరం నుంచి సగానికి తగ్గించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్చార్డీ) శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ చెప్పారు. బీఏ, బీకాం డిగ్రీల సిలబస్‌ కన్నా స్కూల్‌ పాఠ్యప్రణాళికనే ఎక్కువగా ఉందన్నారు. చదువే కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన ఇతర కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాజ్యసభ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జవదేకర్‌ మాట్లాడారు.

‘సిలబస్‌ను సగానికి తగ్గించాలని ఎన్‌సీఈఆర్‌టీకి సూచించాను. 2019 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది’ అని అన్నారు. పాఠశాల స్థాయిలో డిటెన్షన్‌ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. పరీక్షలు లేకుండా విద్యార్థుల మధ్య పోటీ ఉండదని, మెరుగైన ఫలితాలు రాబట్టాలంటే పోటీ వాతావరణం అవసరమని స్పష్టం చేశారు. పాఠశాల విద్యకు సంబంధించిన ఈ సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లును మలి విడత బడ్జెట్‌ సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నామని తెలిపారు.  

మార్చి తరువాత మే..
మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు మేలో పరీక్షలు నిర్వహిస్తామని జవదేకర్‌ చెప్పారు. ఈ రెండింట్లోనూ ఫెయిలైన విద్యార్థులనే పై తరగతులకు వెళ్లకుండా డిటెన్షన్‌ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ‘విద్యార్థుల సామర్థ్యాలు, బలహీనతలు తెలుసుకుని అందుకు అనుగుణంగా వారికి దిశానిర్దేశం చేయడం ఉపాధ్యాయుల ప్రాథమిక విధి’ అని ఆయన వ్యాఖ్యానించారు. విద్యా హక్కు చట్టం కింద 2015 నాటికి దాదాపు 20 లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, 5 లక్షల మందికి మాత్రమే శిక్షణనివ్వడం సాధ్యమైందన్నారు. మరోవైపు, 14 లక్షల మంది ఉపాధ్యాయులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ నెల చివరి నాటికి నూతన విద్యా విధానంపై నివేదిక సిద్ధమవుతుందని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు