మొక్కజొన్నపై సూర్యప్రతాపం

7 Oct, 2014 02:38 IST|Sakshi

సూర్యప్రతాపంతో మొక్కజొన్న ఎండిపోతోంది. అధిక ఉష్ణోగ్రతలు ఈ పంట రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గింజపోసుకునే దశలో పంట ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బెట్ట పరిస్థితుల వల్లే పంట ఎండిపోతోందని చెబుతున్న వ్యవసాయ అధికారులు తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఎక్కువగా గిరిజన రైతులే నష్టపోతున్నారు. రుణమాఫీ నేపథ్యంలో కనీసం బీమా సౌకర్యానికీ నోచుకోక వారంతా డీలా పడుతున్నారు.
 
ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో మొక్కజొన్న రైతుకు కష్టకాలం దాపురించింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులతో ఎండిపోతుండటంతో రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. బట్టతడుపు జల్లైనా కురిస్తే పంట చేతికొస్తుందన్న ఆశతో చూస్తున్నాడు. గింజపోసుకునే దశలో పంట ఎండిపోతుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితి కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నుంచి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి సమయంలో మొక్కజొన్న సాగు మేలని రైతులు దీనివైపు మొగ్గుచూపారు.

జిల్లాలో మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 36 వేల ఎకరాలు కానీ ఈ ఏడాది దాదాపు 45 వేల ఎకరాల్లో (పోడు భూముల్లో సాగుతో  కలుపుకొని) దీన్ని సాగు చేశారు. జిల్లాలోని ఇల్లెందు, బయ్యారం, గుండాల, టేకులపల్లి, కారేపల్లి, కామేపల్లి, గార్ల, పాల్వంచ, ముల్కలపల్లి, జూలూరుపాడు, ఏన్కూరు, మధిర, చింతకాని, బోనకల్లు, ముదిగొండ, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్ తదితర మండలాల్లో ఈ పంటను ఎక్కువగా సేద్యం చేస్తున్నారు. చెదురుమదురుగా కురిసిన వర్షాలకు జూలై నెలలో ఈ పంటను వేశారు. 90-110 రోజుల కాల పరిమితి కలిగిన మొక్కజొన్న హైబ్రిడ్ రకాలను ఎక్కువ మంది రైతులు సేద్యం చేశారు. జూలై, ఆగస్టు చివరి వారాలు, సెప్టెంబర్ మొదటి వారాల్లో వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు మొక్కజొన్న ఆశాజనకంగా ఉంది. ఆ తర్వాత దాదాపుగా నెల రోజుల నుంచి చినుకు రాలలేదు. మొక్కజొన్న పాల కంకి దశ, గింజపోసుకునే దశలో ఉంది. ఈ తరుణంలో వర్షాలు లేకపోవటం, దీనికి తోడు ఉష్ణోగ్రతలు పెరగటంతో మొక్కజొన్న పైర్లు ఎండిపోతున్నాయి.

గింజపోసుకునే దశలో వాడుముఖం
వర్షాలు కురవకపోవడం, అధిక ఉష్ణోగ్రతలతో గింజపోసుకునే దశలో పంట ఎండిపోతోంది. ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, గుండాల, బయ్యారంలో మొక్కజొన్నను పోడు భూముల్లో కూడా సాగుచేయడంతో పంట ఎండిపోతోంది. ప్రస్తుతం  పంట పాలకంకి దశలో ఉంది. ఈ దశలో నీటి ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో పంట ఎండిపోతే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
 
ఏజెన్సీ రైతుకు దెబ్బ..
ఈ పంటను ఎక్కువగా ఏజెన్సీ ప్రాంత రైతులే సాగు చేశారు. పోడు భూములు, నీటి సౌకర్యం లేకుండా ఉన్న ప్రాంతాల్లో రైతులు మొక్కజొన్న సాగును ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. కానీ ఆ పంటకు సరిపడా వర్షం కూడా కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లో ఎక్కువగా మెట్ట భూములు ఉన్నాయి. ఈ భూముల్లో తేమ నిల్వ ఉండే అవకాశం లేకపోవడంతో రైతులు మొక్కజొన్న వైపు మొగ్గు చూపారు. ఇటీవల అసలే వర్షాలు కురవకపోవడంతో పాలకంకి దశలో ఉన్న పంట ఎండిపోతోంది.
 
ఎకరాకు రూ. 20 వేల మేరకు నష్టం వాటిల్లుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టుబడులు కూడా చేతికి వస్తాయో రావోనని భయపడుతున్నారు.
     
రుణమాఫీ కారణంగా బ్యాంకులో రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు తమ పంటలకు ఇన్సూరెన్స్ చేయలేకపోయారు. దీనివల్ల పంట ఎండిపోయినా ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రైతుల పరిస్థితి రెంటికి చెడిన రేవడిలా తయారైంది.
 
జేడీఏ దృష్టికి పంట నష్టం...
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎండిపోయిన మొక్కజొన్న వివరాలను వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయాధికారులు, జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు వి.బి.భాస్కర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. అనుకూలమైన వర్షాలు లేని కారణంగా పంట ఎండిపోయిందని, దీనికి తోడు అధిక ఉష్ణోగ్రతలు ఉండటం కూడా కారణమైందని జేడీఏకు వివరించారు. ఈ అంశంపై జేడీని వివరణ కోరగా ‘గత కొద్ది రోజులుగా వర్షాలు లేవు. బెట్ట ప్రాంతాల్లో మొక్కజొన్న వాడిపోతోంది’ అని చెప్పారు.

>
మరిన్ని వార్తలు